ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలి
నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం టౌన్ (దరిమడుగు): ప్రైవేటీకరణ వైపు చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపుతోందని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ నిర్వహిస్తే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం రాత్రి కోటి సంతకాల సేకరణలో భాగంగా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం ఎంతో అవసరమని భావించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు తో పాటు రాష్ట్రంలో ఒక్కసారిగా 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయమని అన్నారు. ఈ ప్రాంత పేద, మధ్య తరగతి ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇప్పటి వరకూ దూరప్రాంతాలైన కర్నూలు, గుంటూరు, ఒంగోలు, విజయవాడ, నంద్యాల తదితర ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు పూనుకుందని, దాన్ని పార్టీలకతీతంగా ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరారు. ప్రైవేటీకరణతో పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. మార్కాపురం మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రకాశానికి వరమని, ప్రైవేటీకరణ చేయకుండా కోటి సంతకాలు చేసి గవర్నర్‌కు పంపి ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. రూ.లక్షల కోట్లు అప్పు తెస్తున్నారని, అయితే మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రం నిధులు మంజూరు చేయటం లేదని విమర్శించారు. ముందుగా దరిమడుగు గ్రామంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నా రాంబాబుకు నాయకులు, అభిమానులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యులు వెన్నా హనుమారెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పీ చెంచిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సలీం, జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ జీ.శ్రీనివాసరెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, నల్లబొతుల కొండయ్య, కంది ప్రమీలారెడ్డి, డాక్టర్ మగ్బుల్‌బాష, జవ్వాజి వెంకట రంగారెడ్డి, ఎంపీటీసీ పెతూరు, కౌన్సిలర్ సిరాజ్, జె.వెంకటరెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, డి.నాసర్, జీ.సుబ్బారెడ్డి, బి.వెంకటకృష్ణా, గోనా వెంకటేశ్వరరెడ్డి, దేవానంద్, వెల్పుల చెన్నారెడ్డి, నజీర్, ఏడుకొండలు, కె.శ్యామ్‌దయాకర్, ఎం.శ్రీనివాసరెడ్డి, బి.బాలకృష్ణారెడ్డి, పీఎల్‌సీ యాదవ్, తర్లుపాడు మండల పార్టీ అధ్యక్షుడు మురారి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.


