ఉపాధి పాయే.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పాయే..

Nov 24 2025 7:26 AM | Updated on Nov 24 2025 7:26 AM

ఉపాధి పాయే..

ఉపాధి పాయే..

చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం జిల్లాలో రెండేళ్లుగా నామమాత్రంగా ఉపాధి పనులు తాజాగా ఈకేవైసీ పేరుతో ఏకపక్షంగా 50,868 జాబ్‌కార్డుల తొలగింపు పార్టీ ముద్రవేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జాబ్‌ కార్డుల తీసివేత టీడీపీ నాయకులు చెప్పిన వారికే కార్డులు

ఒంగోలు టౌన్‌:

వైఎస్సార్‌ సీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో పార్టీలు, కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తే నేడు చంద్రబాబు పాలనలో కులమతాలు, రాజకీయాల పార్టీలను బట్టి పథకాలను అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకంపైనా టీడీపీ నాయకుల పెత్తనంతో పేదల పొట్టకొడుతున్నారు. ఈకేవైసీ సాకుతో ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులను ఏకపక్షంగా తొలగిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో గ్రామీణ పేదలకు ఉపాధి పనులు దొరికే అవకాశమే లేకుండా పోయే పరిస్థితి తలెత్తుతుందని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. కేవలం అధికార పార్టీ సానుభూతిపరులకు మాత్రమే పనులు దొరుకుతున్నాయని, రాజకీయాల పేరుతో పేదల పొట్టకొట్టడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని విమర్శిస్తున్నారు.

50,868 జాబ్‌కార్డుల తొలగింపు:

జిల్లాలో నిన్నటి వరకు 4,52,868 ఉపాధి హామీ జాబ్‌ కార్డులున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏరివేతలో 50,868 కార్డులను తీసేశారు. దీంతో ప్రస్తుతం 4.02 లక్షల కార్డులు మాత్రమే మిగిలాయి. జిల్లాలోని కొనకనమిట్ల మండలంలో ఏడాదిన్నర వ్యవధిలో 1350 జాబ్‌ కార్డులు తొలగించారు. ఒక్క పెదారికట్ల పంచాయతీలో 350 కుటుంబాల జాబ్‌ కార్డులను తీసేశారు. కంభం మండలంలో 511 జాబ్‌ కార్డులు, సింగరాయకొండ మండలంలో 1411, జరుగుమల్లి మండలంలో 600 కార్డులను తొలగించారు. ఈ కార్డుల్లో ఎక్కువగా దళితులు, వెనకబడిన వర్గాలు, గిరిజనులు, మైనారిటీల కార్డులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏ ఒక్క జాబ్‌ కార్డును సాధారణ పద్ధతిలో రద్దు చేయడానికి వీలులేదు. జాబ్‌ కార్డులున్న కుటుంబం ఇతర ప్రాంతాలకు శాశ్వితంగా వలస వెళ్లినట్లు తగిన రుజువులుండాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలను పాటించలేదు. జాబ్‌ కార్డుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్డులు తొలగించినట్లు తెలుస్తోంది. గ్రామ సభలు ఏర్పాటు చేసి కార్డులను రద్దు చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించలేదు. దాంతో కార్డుదారులకు తమ కార్డును తొలగించిన సంగతి నేటికీ తెలియని దుస్థితి నెలకొంది. గ్రామస్థాయి టీడీపీ నాయకులు చెప్పిన వారి పేర్లను మాత్రమే తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ...

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకానికి కష్టాలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిందే తడవుగా జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల మీద టీడీపీ నాయకులు కన్నేశారు. అప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లందరినీ తొలగించాలని పట్టుబట్టారు. జిల్లాలోని 729 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించి తమ కనుసన్నల్లో మెలిగే టీడీపీ కార్యకర్తలను ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా నియమించుకున్నారు. ఈ తంతు రెండు మూడు నెలల పాటు కొనసాగింది. దీని కోసం ఉపాధి పనులను పూర్తిగా పక్కన పెట్టేశారు. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఉపాధి కూలీలకు పనులు లేకుండా పోయాయి. ఇక రెండో ఏడాది వచ్చే సరికి వర్షాల కారణంగా అరకొర పనులు మాత్రమే చేశారు. పల్లెపండుగ, మొక్కలు నాటడం వంటి నామ మాత్రపు పనులతో మమ అనిపించారు. దాంతో రెండో ఏడాది కూడా ఉపాధి పనులు కొండెక్కాయి. తాజాగా మూడో ఏడాదిలోనైనా పనులు దొరుకుతాయిలే అనుకుంటున్న ఉపాధి కూలీల నెత్తిమీద జాబ్‌ కార్డుల ఏరివేత పిడుగు పడింది. సుమారు 15 నుంచి 20 శాతం వరకు జాబ్‌ కార్డులను తొలగించడంతో ఈ సారి కూడా పనులు లేవన్న సంకేతాలు ఇచ్చినట్లయింది.

తూతూ మంత్రంగా గ్రామ సభలు

శనివారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించినట్లు డ్వామా అధికారులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ గ్రామ సభల్లో జాబ్‌ కార్డులో ఉన్న ఈకేవైసీ లోటుపాట్లను సవరించినట్లు అధికారులు చెబుతున్నారు. నిజానికి జిల్లాలోని 729 గ్రామ పంచాయతీల్లో సగానికిపైగా గ్రామ సభలు నిర్వహించలేదని తెలుస్తోంది. ఒక వేళ ఎక్కడైనా గ్రామసభ నిర్వహించినా స్థానిక ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా సభ నిర్వహించినట్లు నాటకం నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం గ్రామ సర్పంచ్‌కు కూడా సమాచారం ఇవ్వకుండా, వార్డు మెంబర్లకు తెలియజేయకుండా ఒకరిద్దరు అధికార టీడీపీ నాయకుల సమక్షంలో గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదో మతలబు లేకుంటే ఇలా రహస్యంగా సమావేశం నిర్వహించాల్సిన అవసరమేమొచ్చిందని గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాళ్లూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు గాను కేవలం నాలుగైదు పంచాయతీల్లో మాత్రమే గ్రామ సభలను నిర్వహించినట్లు తెలుస్తోంది. కనిగిరి, మార్కాపురం, దర్శి, కొండపి, ఒంగోలు, యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని అనేక పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించలేదు. మరికొన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు తమకు తెలియదని సర్పంచ్‌లే చెబుతుండడం గమనార్హం.

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఉపాధి హామీ పథకానికి గండిపడింది. గ్రామంలో చేసేందుకు పనులు లేకపోవడంతో గ్రామీణులు ఊరొదిలి వలసబాట పడుతున్నారు. మూలుగుతున్న నక్కమీద తాటికాయ పడిన చందంగా రాష్ట్ర ప్రభుత్వం వేలాది జాబ్‌ కార్డులను తొలగిస్తోంది. ఈకేవైసీ సాకుతో గ్రామాల్లో టీడీపీ నాయకులు చెప్పిన వారి జాబ్‌ కార్డులను ఏకపక్షంగా తొలగిస్తున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలపై రాజకీయ ముద్రలు వేసి వారి జాబ్‌ కార్డులు తొలగిస్తుండటంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement