25న జిల్లా హ్యాండ్ బాల్ సెలక్షన్స్
కొనకనమిట్ల: మండలంలోని వెలుగొండలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో ఈనెల 25వ తేదీ జిల్లా హ్యాండ్‌బాల్ జట్ల సెలక్షన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల పీడీ పెద్దన్న తెలిపారు. ప్రకాశం జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాల, కళాశాల తరఫు క్రీడాకారులు పాల్గొనేవారు 99127 45545 నంబరును సంప్రదించాలని పీడీ పెద్దన్న కోరారు.
ఒంగోలు సిటీ: మండల విద్యాశాఖాధికారులు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వివరాలను జిల్లా పరిషత్ కార్యాలయానికి పంపించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ లక్ష్మీనారాయణ, ఐఫియా కౌన్సిలర్ పి.వి.సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల తరువాత అన్ని మండలాల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలామంది మారారు కనుక వారి వివరాలు జిల్లా పరిషత్ కార్యాలయానికి పీఎఫ్ షెడ్యూల్స్ లో రిమార్కుల కాలంలో పంపాలన్నారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటి వరకు పీఎఫ్ షెడ్యూల్స్ పంపని వారు కూడా పంపించాలని విజ్ఞప్తి చేశారు.
చీమకుర్తి: కరాటే, కుంఫు పోటీల్లో చీమకుర్తి విద్యార్థులు బంగారు పతకాలతో మెరిశారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన 12వ జాతీయ స్థాయి కరాటే, కుంఫు పోటీల్లో చీమకుర్తి నుంచి 19 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 15 మందికి బంగారు పతకాలు, ముగ్గురికి సిల్వర్, ఒక్కరికి బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు కోచ్‌గా వ్యవహరించిన డీఎన్‌వీ సుధాకర్ తెలిపారు. ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ సంస్థ ఫౌండర్ దేవరకొండ వెంకటేశ్వర్లు అభినందించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 800 మంది పాల్గొనగా వారిలో చీమకుర్తి నుంచి 19 మంది తమ నైపుణ్యాలను ప్రదర్శించటంతో స్థానికులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
కొండపి: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అందుకు అనుగుణంగా బస్సులను పెంచాల్సింది పోయి ఉన్న బస్సుల్లోనే కోతలు విధించడంతో ఆర్టీసీ సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులో దాదాపు 100 మంది ఎక్కి సర్దుకోకపోవడంతో బస్సును కండక్టర్ నిలిపేసిన సంఘటన మండల కేంద్రమైన కొండపిలోని దాసిరెడ్డిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు కామేపల్లి నుంచి కొండపి మీద ఒంగోలు వెళుతున్న ఆర్టీసీ బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఎక్కారు. బస్సు సామర్థ్యం 60 మంది మాత్రమే ఉండగా 100 మంది ఎక్కడంతో కండక్టర్ సర్దుకోమని చెప్తుండగా ఎవరూ ఆమె మాట లెక్క చేయకపోగా ఆమె తో ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగారు. దీంతో విధిలేక కండక్టర్ దాసిరెడ్డిపాలెం సమీపంలో బస్సును నిలిపివేశారు. దాంతో గంట పాటు ఆ ప్రాంతమంతా ఎక్కువ మంది జన సమీకరణ ఉండడంతో ఏం జరిగిందోనని స్థానికులు ఆందోళన చెందారు. తీరా పోలీసులు జోక్యం చేసుకొని బస్సును పంపించడంతో వివాదం సద్దుమణిగింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.


