బైక్ అదుపుతప్పి ఒకరు మృతి
దర్శి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మరణించిన సంఘటన దర్శి మండలంలోని మార్కెట్ యార్డు సమీపంలో శనివారం జరిగింది. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన రత్నారెడ్డి, చిన్న బంగారయ్య, వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై దర్శి బయలుదేరారు. శివరాజనగర్ దాటి మార్కెట్ యార్డు వద్దకు వెళ్లేసరికి ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రత్నారెడ్డి అపస్మారక స్థితికి చేరాడు. మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. 108కి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది బాలజ్యోతి, కే నరేష్‌లు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రత్నారెడ్డి (40) మృతి చెందాడు.
ఒంగోలు వన్‌టౌన్: పీఎంఏవై–ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా పక్కా గృహాల కోసం ఈ నెల 30వ తేదీలోపు నమోదు చేసుకోవాలని హౌసింగ్ పీడీ పెరుగు శ్రీనివాస ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. గ్రామాల్లో పక్కా గృహాల మంజూరుకు లబ్ధిదారులు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్, మండలంలోని అసిస్టెంట్ ఇంజినీర్‌ను సంప్రదించాలన్నారు. లబ్ధిదారుల వద్దకే సిబ్బంది వెళ్లి ఫేస్ అథెంటికేషన్ పద్ధతి ద్వారా వారి వివరాలను యాప్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ ఉండాలన్నారు. స్థలం ఉన్నవారు – స్థలం లేనివారు అందరూ ఈ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకుంటే భవిష్యత్తులో స్థలం మంజూరైన తర్వాత పక్కా గృహాల నిర్మాణాలు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలలో పక్కా గృహాలు పొందాలనుకునే అర్హులైన ప్రతి కుటుంబం తప్పనిసరిగా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.


