ఆర్‌పీలపై టీడీపీ నాయకుడి అసభ్య పోస్టులు
● పోలీసు కేసు నమోదు చేయాలని
డీఎస్పీకి మహిళా ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల వినతి
ఒంగోలు టౌన్: నగరానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు మెప్మాలో పనిచేసే మహిళా ఆర్పీలను ఉద్దేశించి అసభ్యంగా కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడం వివాదాస్పదమైంది. మెప్మా ఉద్యోగితో కారులో తిరిగే ఆర్పీల వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ నగరంలోని 48వ డివిజన్‌కు చెందిన టీడీపీ నాయకుడు రామ్ చౌదరి వాట్సాప్ గ్రూపులో మెసెజ్ పెట్టాడు. ఇది సోషల్ మీడియోలో బాగా వైరల్ అయింది. దీంతో మెప్మా మహిళా ఉద్యోగులు, సీఐటీయూ నాయకులు శనివారం డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో మెసెజ్ పెట్టిన టీడీపీ నాయకుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. మెప్మా ఉద్యోగినులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. డీఎస్పీతో పాటు మెప్మా పీడీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా సోమవారంలోపు రామ్‌చౌదరి మీద కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోకపోతే ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. డీఎస్పీని కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పి.కల్పన, జిల్లా కార్యదర్శి జి.రమేష్, నాయకులు ఎస్డీ హుసేన్, ఆర్‌పీల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, రాహేలమ్మ, దేవయాని, నయోమి, సంధ్య తదితరులు ఉన్నారు.


