మండలాలు పంచుకొని..
టీడీపీ నేతల కనుసన్నల్లోనే ..
గిద్దలూరులో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తవ్వకాలు రూపురేఖలు మారిపోతున్న కొండలు నాగులవరం, చిన్నకంభం, ఎల్‌కోటల్లో మాయమవుతున్న కొండలు రేయింబవళ్లు తవ్వకాలు..ట్రాక్టర్లలో తరలింపు మండలానికి ఇద్దరు నేతలకు అప్పగింత పట్టించుకోని అధికారులు
అధికారంలోకి వచ్చిన మరుక్షణం పచ్చ మాఫియా బరితెగించింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు సహజ వనరుల్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. కొండల్ని పిండిచేస్తూ..చెరువుల్ని గుల్ల చేస్తూ కాసుల వేట సాగిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఈ గ్రావెల్ మాఫియాకు అడ్డేలేకపోవడంతో మట్టిని యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఈ అక్రమాలకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అక్రమాలకు చెక్ పెట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం అవినీతిలో కూరుకుపోయి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దరగ సమీపంలో మట్టి తోలడంతో చదునుగా మారిన కొండ
బేస్తవారిపేట:
గిద్దలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో భారీ వాహనాలతో తవ్వకాలు చేస్తూ సహజ వనరుల్ని చెరబడుతున్నారు. వ్యవసాయ భూముల చదును, లేఅవుట్లు, గృహ నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం నిత్యం విచ్చలవిడిగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అనుమతులు లేని తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
రేయింబవళ్లు తరలింపు..
గిద్దలూరు మండలంలోని కేఎస్ పల్లి సమీపం రైల్వేట్రాక్ వద్ద, యడవల్లి సమీపంలోని కొండలు, తిప్పల నుంచి అక్రమంగా మట్టి రవాణా జరుగుతోంది. కంభం, అర్ధవీడు మండలాలకు అర్ధవీడు మండలంలోని నాగులవరం కొండ నుంచి, కంభం మండలంలోని చిన్నకంభం, ఎల్‌కోటలలోని కొండలను జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో యథేచ్ఛగా మట్టి రవాణా చేస్తున్నారు. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలోని జగనన్న లేఅవుట్ పై ఎత్తున, చెట్టిచర్ల సమీపంలో, దరగ కొండపై నిత్యం గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పెంచికలపాడు చెరువు మట్టి ఇటుకల బట్టీలకు బేస్తవారిపేట, కొమరోలు మండలాలకు అక్రమంగా తరలిస్తున్నారు. అసరమైనప్పుడు జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. భారీగా ట్రాక్టర్లు పెట్టి వందల ట్రిప్పులు ఇటుకల బట్టీలకు తీసుకెళ్తున్నారు. కొమరోలు మండలంలోని పామూరుపల్లె గ్రామ సమీపంలో రాష్ట్రీయ రహదారికి సమీపంలో అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రుల వేళ అక్రమంగా మట్టితోలకాలను యథేచ్ఛగా చేపడుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టి మాఫియా వివరాలను స్థానికులు సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకో..ముడుపులకో తలొగ్గిన అధికారులు ఫిర్యాదులొచ్చినా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే పలు కొండల రూపురేఖలు మారిపోయాయి. మట్టిని అడ్డగోలుగా తరలించేస్తుండడంతో చాలా కొండలు చదునుగా మారిపోయాయి. తిప్పలు అయితే మాయమైపోయాయి. ఈ అక్రమాలను అడ్డుకట్టవేయాల్సిన ప్రభుత్వ శాఖలు అవినీతిలో కూరుకుపోయాయి. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, పోలీస్ వ్యవస్థలు అన్నీ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. ఎక్కడ ఏ తవ్వకాలు జరుగుతున్నా అధికార పార్టీ నేతల అనుచరులతో పాటు ఆయా శాఖల అధికారుల సహకారం ఉంటోంది.
వందలాది వాహనాల్లో తరలింపు..
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోజూ వందలాది ట్రాక్టర్లలో మట్టిని తరలించేస్తున్నారు. రోజూ 300 నుంచి 350 ట్రాక్టర్లలో సహజ సంపదను తరలిస్తున్నారని తెలుస్తోంది. గతంలో రూ.400 లకు దొరికే ట్రాక్టర్ మట్టి నేడు రూ.700లకు పైగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ట్రాక్టర్‌పై దాదాపు రూ.300 వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే సహజ సంపదను దోచేస్తూ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
గతంలో రియల్ ఎస్టేట్, గృహాలు నిర్మించుకునే సమయంలో, ప్లాట్లను చదును చేసుకోవడానికి, గ్రావెల్ రోడ్లకు అందుబాటులో ఉన్న చోటు నుంచి గ్రావెల్‌ను ట్రాక్టర్ యజమానులు తెచ్చేవారు. నేడు ప్రతి మండలంలో ఒకరు–ఇద్దరు టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే అప్పగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి కనుసన్నల్లోనే మట్టి సరఫరా జరగాలి. అధికారులు సైతం వీరు చెప్పినట్టే నడవాలి అన్న రీతిలో దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా వ్యక్తిగత అవసరాలకు తెచ్చుకున్నా వీరికి కప్పం కట్టాల్సిందే. లేదంటే అధికారులను ఉసిగొల్పి వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారు.
మండలాలు పంచుకొని..


