నాలుగు మండలాల్లో తగ్గిన సీ్త్రల నిష్పత్తి
ఒంగోలు టౌన్: జిల్లాలోని టంగుటూరు, మర్రిపూడి, రాచర్ల, సీఎస్‌పురం మండలాల్లో సీ్త్రల నిష్పత్తి తక్కువగా ఉందని, వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఆయా మండలాలపై ఎక్కువగా దృష్టిసారించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం గర్భస్థ లింగనిర్ధారణ చట్టంపై అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 186 స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని మూడు డివిజన్లలోని స్కానింగ్ సెంటర్లను పరిశీలించి అక్కడ పనిచేసే వైద్యుల విద్యార్హత, సెంటర్ డాక్యుమెంట్ల వివరాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. తల్లి గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మాత్రమే స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి స్కానింగులు చేయరాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే మూడేళ్ల జైలుశిక్షతో పాటుగా లక్ష రూపాయల జరిమానా విధిస్తారని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారు, చేయించుకున్న వారు శిక్షకు గురవుతారని తెలిపారు. స్కానింగ్ సెంటర్‌కు వచ్చే గర్భిణుల వివరాలను ఎఫ్ ఫారంలో ఆన్‌లైన్లో నమోదు చేయాలని చెప్పారు. సమావేశంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు డా.సంధ్యారాణి, డా.తిరుపతిరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, డీపీఆర్‌ఓ మోహన్ రాజు, ఐద్వా సెక్రటరీ కె.రమాదేవి, జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారి బెల్లం నరసింహారావు, డిప్యూటీ డెమో సరోజిని పాల్గొన్నారు.


