జీజీహెచ్‌లో పారిశుధ్య పరిస్థితుల పరిశీలన
ఒంగోలు టౌన్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య లోపం కారణంగా రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు రావడంతో ఎట్టకేలకు స్పందించారు. కలెక్టర్ పి.రాజబాబు ఆదేశాలతో డీఆర్‌ఓ ఓ.చిన ఓబులేసు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, ఏపీ హెచ్‌ఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిర్మల్ కుమార్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ కె.అద్దయ్యలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య స్థితిగతులను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, మురుగు నీటి సరఫరా, డంపింగ్ ప్రదేశాలలను పరిశీలించారు. 8, 9 బ్లాకుల మధ్య దుర్వాసన వేయడాన్ని గమనించారు. అక్కడ డ్రైనేజీ కాలువల్లో వ్యర్థ పదార్థాలు పేరుకొని పోయాయని, నీరు పారకపోవడంతో దుర్గంధం వేస్తుందని అధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం వెంటనే నగర పాలక సంస్థ కమిషనర్‌తో మాట్లాడారు. దీంతోపాటుగా మెడికల్ కాలేజీ, వైద్యశాల పరిధిలో 180 బిట్స్ పైప్‌లైన్స్ జాయింట్ల దగ్గర మరమ్మతులు చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. నగర పాలక సంస్థ సిబ్బందితో సహకారం తీసుకొని డ్రైనేజీని శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆస్పత్రి ముఖద్వారం, లోపల ఓపీ వద్ద వెయిటింగ్ ప్రదేశాలు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో సానుకూల వాతావరణం కనిపించేలా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇందుకోసం త్వరలోనే ఆర్కిటెక్చర్ సలహాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ బృందం వెంట ఆర్‌ఎంఓ డా.మాధవిలత, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ ఉన్నారు.


