నేడు మార్కాపురంలో కోర్టు భవనాలు ప్రారంభం
మార్కాపురం: మార్కాపురంలోని కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన ఆరో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాలను శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్ ఠాగూర్ వర్చువల్ విధానంలో ప్రారంభించనుండగా కార్యక్రమానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గన్నమనేని రామకృష్ణప్రసాద్, వై.లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.భారతి, మార్కాపురం 6వ అదనపు న్యాయమూర్తి ఎం.శుభవాణి హాజరుకానున్నారు. వీరితోపాటు జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని మార్కాపురం బార్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆదివారం నుంచి 25వ తేదీ వరకు బాలబాలికలకు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు కాలేజి ప్రిన్సిపాల్ ఎం.సౌజన్య తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లా జిల్లాల నుంచి బాలబాలికలు సుమారు 250 మంది రానున్నారని, వీరికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. క్రీడల నిర్వహణకు 4 కోర్టులు సిద్ధం చేశామని పీడీ శంకరరావు తెలిపారు.
కనిగిరిరూరల్: పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పొదిలి మండలం అక్కచెరువు గ్రామానికి చెందిన బోగాని సురేష్(25) అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. అతని స్నేహితుడితో కలిసి ఈ నెల 19న సీఎస్‌పురం మండలంలోని భైరవకోన, నారాయణ స్వామి ఆలయాలను సందర్శించారు. అదేరోజు రాత్రి తిరిగి కనిగిరి మండలం నందనమారెళ్ల సమీపంలో గుడి వద్ద నిద్రిస్తుండగా.. సురేష్ పాము కాటుకు గురయ్యాడు. హుటాహుటిన పొదిలి ఆస్పత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ వైద్యశాలలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై టి.శ్రీరామ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
గిద్దలూరు రూరల్: లారీ ఢీకొనడంతో వెనుక చక్రాల కింద పడిపోయిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ సంఘటన గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. గిద్దలూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన కాశయ్య(59) రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో నంద్యాల నుంచి ఒంగోలు వైపు ప్రయాణిస్తున్న లారీ ఆయన పక్క నుంచి దూసుకెళ్లింది. వెనుక టైర్ల కిందపడిపోయిన కాశయ్య తీవ్రగాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఒంగోలు టౌన్: ఔషధ నియంత్రణ శాఖ ఇన్‌స్పెక్టర్‌గా ఉషారాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె మార్కాపురం డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న రామమూర్తి పదోన్నతిపై బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఉషారాణి బాధ్యతలు చేపట్టారు. నూతన డీఐని ది ఒంగోలు రిటైల్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకారెడ్డి, ప్రధాన కార్యదర్శి కూరపాటి సత్యనారయణ, కోశాధికారి ఏడుకొండలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
నేడు మార్కాపురంలో కోర్టు భవనాలు ప్రారంభం
నేడు మార్కాపురంలో కోర్టు భవనాలు ప్రారంభం
నేడు మార్కాపురంలో కోర్టు భవనాలు ప్రారంభం


