కాళ్లు మొక్కి.. కనికరించాలని వేడుకుని..!
ఒంగోలు సిటీ: పదోన్నతి కోసం దొడ్డి దారిని ఎంచుకున్న ఇద్దరు ఆర్‌అండ్‌బీ(రోడ్లు, భవనాల శాఖ) ఉద్యోగుల వ్యవహారం విజిలెన్స్ విచారణలో బట్టబయలు కావడంతో క్షమాపణ కోరుతూ ఉన్నతాధికారుల కాళ్లు మొక్కడం చర్చనీయాంశమైంది. విద్యార్హతకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడమే కాకుండా ఏడాది నుంచి అదనపు జీతంతోపాటు ఇంక్రిమెంట్ పొందినట్లు అధికారుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. కనిగిరి ఆర్‌అండ్‌బీ డివిజన్‌లో వల్లం పోలయ్య ప్రింటింగ్ టెక్నీషియన్‌గా, కొడవటి జోసెఫ్ అటెండర్‌గా పనిచేస్తున్నారు. పదోన్నతి పొందితే వేతనం పెరుగుతుందన్న ఆశతో ఇద్దరూ అడ్డదారి తొక్కారు. అనుకున్నదే తడవుగా పథక రచన చేశారు. సివిల్ ఐటీఐ కోర్సు చదవడం కోసం ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ నుంచి రెండేళ్ల స్టడీ లీవ్ పొందారు. చీరాలలోని నరేంద్ర ఐటీఐ కాలేజీలో 2020–2022 బ్యాచ్ కింద రెగ్యులర్ స్టూడెంట్స్‌గా జాయిన్ అయ్యారు. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత తమ పథకాన్ని అమలు చేశారు. తమ చదువు పూర్తయిందంటూ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఆర్‌అండ్‌బీ అధికారులకు సమర్పించారు. గుడ్డిగా నమ్మేసిన అధికారులు తదుపరి తంతు ముగించారు. తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయి ఆ తర్వాత 13 నెలలకు వేతనం డ్రా చేశారు. అదే సమయంలో చదివినట్లుగా సర్టిఫికెట్, రికార్డ్స్ సృష్టించి, వాటితోనే పదోన్నతి కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు తమ డైరెక్టర్ జనరల్‌కు నివేదిక ఇచ్చారు. జిల్లా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నుంచి ఆ ఇద్దరు ఉద్యోగుల పూర్తి రికార్డులు, ఐటీఐ రెగ్యులర్ కోర్సు చదివిన సమయంలో జీతాలు డ్రా చేసిన బిల్లులు తెప్పించుకున్న ఒంగోలు విజిలెన్స్ అధికారులు.. సర్టిఫికెట్లు నకిలీవని తేల్చారు. దీంతో ఆ ఇద్దరు ఉద్యోగులు జిల్లా విజిలెన్స్ కార్యాలయానికి చేరుకుని అధికారుల కాళ్లు మొక్కి మన్నించాలని వేడుకోగా ససేమిరా అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వల్లం పోలయ్య గతంలోనూ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్‌తో అటెండర్ నుంచి ప్రింటింగ్ టెక్నీషియన్(బీపీఓ)గా పదోన్నతి పొందినట్లు డీఎస్పీ విచారణలో తేలడంతో సస్పెండ్ చేశారు. అయితే కోర్టు స్టే ఆర్డర్‌తో ప్రస్తుతం అదే ఉద్యోగంలో కొనసాగుతున్న పోలయ్య పదోన్నతి కోసం అడ్డదారులు తొక్కి అధికారులకు దొరికిపోయారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రవినాయక్‌ను వివరణ కోరగా.. ‘ఇద్దరు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా పదోన్నతి పొందిన మాట వాస్తవం. దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు విచారిస్తున్నారు’ అని తెలిపారు.


