యాంటిబయాటిక్స్ విచ్చలవిడి వాడకం ప్రమాదం
ఒంగోలు టౌన్: విచ్చలవిడిగా యాంటిబయాటిక్స్ వాడకం వలన శరీరంలో డ్రగ్ రెసిస్టెంట్‌గా మారి వ్యాధులు త్వరగా నయం కాకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. ప్రపంచ మైక్రోబియల్ అవగాహనా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మెడికల్ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యుల సలహా, సూచనలేకుండా యాంటిబయాటిక్స్ వాడరాదని చెప్పారు. ఒంగోలు మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 24 వరకు వారోత్సవాలు నిర్వహించన్నుట్లు తెలిపారు. ఇందులో భాగంగా బాధ్యతాయుత యాంటిబయాటిక్స్ వినియోగం, పెరుగుతున్న ఏఎంఆర్ ప్రమాదాలు, ఓన్ హెల్త్ దృక్పథంతో దాన్ని ఎదుర్కొనే విధాలనాల గురించి వివరించారు. ఈ అంశాల గురించి విద్యా సదస్సులు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ వైద్యులు, వైద్య విద్యార్థులు, సాధారణ ప్రజల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సమస్యలపై అవగాహన కల్పించడం భవిష్యత్తు తరాల ఆరోగ్య రక్షణలో భాగమని చెప్పారు. యాంటీబయాటిక్స్ వాడకం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, హెచ్‌ఓడీ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు.
పొదిలి: ఇంటికి తాళం వేస్తున్న సమయంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం రాత్రి పొదిలిలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక సబ్ స్టేషన్ రోడ్డులో ఈశ్వరమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. సమీపంలోనే నివాసం ఉంటున్న తన కూతురు వద్దకు వెళ్లేందుకు ఇంటికి తాళం వేస్తుండగా ఓ యువకుడు మెరుపు వేగంతో వచ్చి ఈశ్వరమ్మ మెడలోని గొలుసు లాక్కుని పరుగు తీశాడు. చుట్టుపక్కల వారు స్పందించేలోగా దొంగ ఉడాయించాడు. నాలుగు సవర్ల బంగారు గొలుసు లాక్కెల్లాడని ఈశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో చైన్ స్నాచింగ్ జరగడంతో స్థానిక మహిళలు ఆందోళన చెందుతున్నారు.


