సిగరెట్ కోసం.. హోంగార్డుల డిష్యుం డిష్యుం!
ఒంగోలు టౌన్: పూటుగా మద్యం తాగిన ఇద్దరు హోంగార్డులు సిగరెట్ తాగే విషయంలో చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఒక హోంగార్డు తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సాగర్ కవచ్ బందోబస్తు విధుల్లో భాగంగా పెద్దారవీడు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న షేక్ యాసిన్, దోర్నాల పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న తంగిరాల ప్రశాంత్ కుమార్, వెలిగండ్ల పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న చెరుకూరి బాల సుబ్రహ్మణ్యం గురువారం ఒంగోలు వచ్చారు. డ్యూటీ అనంతరం రాత్రి బస చేసేందుకు నగరంలోని ఒక లాడ్జిలో గది తీసుకున్నారు. ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. ఈ క్రమంలో సిగరెట్ విషయమై ప్రశాంత్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో సుబ్రహ్మణ్యం కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎస్పీ హర్షవర్థన్ రాజు సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసు ప్రతిష్టకు భంగం కలిగించిన హోంగార్డులపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ముగ్గురు హోంగార్డులను హెడ్ క్వార్టర్స్‌కు పిలిపించి విచారణ చేస్తున్నారు. ప్రశాంత్ కుమార్, బాల సుబ్రమణ్యంను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు.
● బైకులు ఢీకొని రోడ్డుపై పడిపోయిన యువకులు
● గ్రానైట్ కంటైనర్ తొక్కడంతో ఒకరు మృతి
● చీమకుర్తి మండలం రెడ్డినగర్ సమీపంలో ప్రమాదం
చీమకుర్తి రూరల్: రెండు బైకులు ఢీకొని రోడ్డుపై పడిపోయిన వ్యక్తుల మీదుగా గ్రానైట్ కంటైనర్ దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన చీమకుర్తి మండలం చీమలమర్రి సమీపంలోని రెడ్డినగర్ ఎన్‌ఎస్పీ కాలువ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. చీమకుర్తికి చెందిన సీహెచ్ ఏడుకొండలు(38), సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన సతీష్ బైకులపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఎస్పీ కాలువ వద్ద బైకులు ఢీకొని పడిపోగా అదే సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్ ఏడుకొండలును తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను సీఐ ప్రసాద్ నేతృత్వంలో చీమకుర్తి సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు ఏడుకొండలుకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కంటైనర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


