రోడ్డంతా విస్తరిస్తే సరే.. అంబేడ్కర్ బొమ్మ దగ్గరైతే కు
టంగుటూరు: రోడ్డు విస్తరణ పేరుతో ఎస్సీ కాలనీలో ఒకలా.. మిగిలిన చోట్ల మరోలా వ్యవహరించడం సరికాదని టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెం ఎస్సీ కాలనీ వాసులు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఎదుట అభిప్రాయం వెలిబుచ్చారు. గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసే క్రమంలో పంచాయతీ కార్యదర్శి జాన్ బాషా తీరుతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, పంచాయతీరాజ్ ఈఈ విజయ్ కుమార్, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో కూడిన బృందం శుక్రవారం అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించారు. రోడ్డు విస్తరణ పేరుతో అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని ఆక్రమించాలని చూశారని, పెత్తందారులు తమపై వివక్ష చూపుతున్నారని అధికారులకు కాలనీ వాసులు వివరించారు. రోడ్డు మొత్తం 30 అడుగుల మేర విస్తరించుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని, అలా కాకుండా అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం వద్ద మాత్రమే విస్తరిస్తామనడం న్యాయబద్ధం కాదని తేల్చిచెప్పారు. విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఆర్డీఓ స్పందిస్తూ.. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. సీఐ హజరత్తయ్య, ఎస్సై నాగమల్లేశ్వరరావు, ఎంపీడీఓ దేవసేన కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓకు స్పష్టం చేసిన కాకుటూరివారిపాలెం ఎస్సీ కాలనీ వాసులు


