పచ్చ తమ్ముళ్లకే ప్రజా దర్బార్!
యర్రగొండపాలెం: ప్రజా దర్బార్ అనే మాటకు అర్థాన్నే మార్చేశారు యర్రొగొండపాలెం టీడీపీ నాయకులు. కేవలం టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరుల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో సామన్యులెవరికీ చోటివ్వలేదు. టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన తెలుగుతమ్ముళ్లు తమ సమస్యలను పరిష్కరించుకున్న తీరు చూసి నియోజకవర్గ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గొప్పలు చెప్పిన టీడీపీ ముఖ్య నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పంచాయతీ, మండల రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల్లో అధికారుల సమక్షంలో నిర్వహించాల్సిన ప్రజాదర్బార్‌ను టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయడంతో అర్జీదారులు ఆ ఛాయలకు వెళ్లే సాహసం చేయలేదు. వైపాలెం ఎంపీడీఓ బి.శ్రీనివాసులు టీడీపీ కార్యాలయంలో ఎటువంటి అర్హత లేని ఆ పార్టీ నేతలతో కలిసి కూర్చుని అర్జీలు స్వీకరించడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. ప్రజా సమస్యలకు టీడీపీ కార్యాలయంలో ఎలా న్యాయం జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా దర్బార్‌లో ఏ సమస్యలపై ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, టీడీపీ కార్యాలయంలో కార్యక్రమం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే విషయమై ఎంపీడీఓను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా శుక్రవారం ఆయన ఫోన్ స్విచాఫ్‌లో ఉంది.


