స్కార్పియో బోల్తా పడి వృద్ధురాలి మృతి
బద్వేలు అర్బన్ : పట్టణానికి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్–67 బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి అదుపు తప్పి స్కార్పియో వాహనం బోల్తా పడిన ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సిరిగిరి పెద్దలక్షుమ్మ (85) తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే గ్రామంలో శనివారం రాత్రి తమ సమీప బంధువుల శుభకార్యం ఉండటంతో.. కుటుంబ సభ్యులంతా కారులో స్వగ్రామానికి బయలుదేరారు. గూడెం, గుంతపల్లె మార్గంమధ్యలోని ఎన్‌హెచ్–67 బైపాస్ రోడ్డులోకి వచ్చేసరికి ఎదురుగా.. కుక్క అడ్డురావడంతో సడన్‌గా బ్రేక్ వేశారు. దీంతో వాహనం ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో పెద్దలక్షుమ్మ తీవ్ర గాయాల పాలైంది. వెంటనే స్థానికుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వాహనంలోని మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అర్బన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


