బిర్యానీ లేదంటావా.. నీ అంతు చూస్తాం
తాళ్లూరు: పూటుగా మద్యం మత్తులో రెస్టారెంట్‌కు వచ్చిన ఇద్దరు యువకులు బిర్యానీ అడగగా యజమాని అయిపోయిందని చెప్పడంతో మొదలైన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఈ వివాదంలో బాధితుడైన రెస్టారెంట్ యజమాని వెంకటరెడ్డిపైనే తాళ్లూరు పోలీసులు కేసు బనాయించడం తాజాగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో పుట్లూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వీఆర్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు రెస్టారెంట్ ఫుడ్ కౌంటర్ మూతవేసిన సమయంలో అదే గ్రామానికి చెందిన ఎదురూరి నాగార్జునరెడ్డి, చింతంరెడ్డి శివారెడ్డి మద్యం మత్తులో అక్కడికి వచ్చారు. రెస్టారెంట్ ముందు భాగంలో మైకం ఎక్కువై బైక్ మీద నుంచి పడిపోయారు. స్థానికుల సాయంతో లోపలికి వెళ్లిన ఇద్దరు యువకులు బిర్యానీ అడిగారు. తినేందుకు ఏమీ లేవని యజమాని చెప్పడంతో అసభ్య పదజాలంతో దూషించారు. ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించడంతో దాడికి యత్నించారు. నీ అంతు తేలుస్తాం. శ్రీమాకే బిర్యానీ లేదంటారా మేమేందో చూపిస్తాంశ్రీ అని దూషిస్తూ వెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్నారు కదా అని యజమాని ఎటువంటి ఫిర్యాదు చేయకుండా తేలికగా తీసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి 10.30 గంటలకు నాగార్జునరెడ్డితోపాటు మరో 11 మంది మారణాయుధాలతో రెస్టారెంట్‌లోకి ప్రవేశించి ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకటరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అడ్డు వచ్చిన వంటమాస్టర్ భీము, సప్లయర్ మనోజ్‌పై కూడా దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలైన వెంకటరెడ్డిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా, వర్కర్లకు స్ధానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు. నిందితులంతా టీడీపీకి చెందిన వారు కావడంతో కేసు నమోదు చేయకుండా ఎస్సై తాత్సారం చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి ఆరోపించారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇచ్చినా తనపైనే తప్పుడు ఫిర్యాదులు చేయించి కేసు నమోదు చేశారని వాపోయాడు. దాడి ఘటనపై ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, తాళ్లూరు ఎస్సై వ్యవహరిస్తున్న తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. సామాన్యులు పోలీస్ స్టేషన్‌కు రావాలంటేనే బెంబేలెత్తుతున్న పరిస్థితి. ఎస్సైకి ఇటీవల ఎస్పీ షోకాజ్ నోటీసులిచ్చి విచారణకు ఆదేశించినా ఆయన తీరు మారలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
తాళ్లూరు మండలం
బొద్దికూరపాడులో రెస్టారెంట్
యాజమానిపై 11 మంది దాడి
ఆర్థికంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేక దాడి చేశారన్న బాధితుడు వెంకటరెడ్డి
నిందితుల ఫిర్యాదుతో తప్పుడు కేసు నమోదు చేశారని ఎస్సైపై ఆరోపణ
బిర్యానీ లేదంటావా.. నీ అంతు చూస్తాం


