క్యాంటీన్ పేరుతో ఖాళీ స్థలంపై కన్ను
చీమకుర్తిలో విలువైన స్థలాన్ని మెప్మా క్యాంటీన్ పేరుతో కబ్జాకు యత్నం మురుగు కాలువ పూడ్చి ప్లాట్‌ఫాం కట్టిన అధికార పార్టీ నేత తొలగించాలని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఆగ్రహం మున్సిపల్ పాలకవర్గానికి చెప్పలేక, అధికార పార్టీని కాదనలేక నీళ్లు నములుతున్న కమిషనర్
చీమకుర్తి: ఖాళీ స్థలం కనిపిస్తే దాన్ని ఏదోక విధంగా కొట్టేయాలని అధికార టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ పట్టణంలోని కర్నూలురోడ్డు ఫేసింగ్‌లో సర్వే నం.18/1బీలోని 36 సెంట్ల వాగుపోరంబోకు భూమే. ఈ వాగుపోరంబోకు భూమిలో 26 సెంట్లకు పైగా ఖాళీ స్థలం, 10 సెంట్ల విస్తీర్ణంలో గోడౌన్ నిర్మించి ఉంది. ఈ స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు మెప్మా క్యాంటీన్ పేరుతో స్వయం సహాయక సంఘాల గ్రూపులను అడ్డంపెట్టుకొని మెప్మా ద్వారా మంజూరు చేయించుకున్న తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాడు. తొలుత మెయిన్ రోడ్డులో ఉన్న ఖాళీస్థలంలో మురుగు నీరు ప్రవహించే కాలువనూ పూడ్చి ప్లాట్‌ఫాం నిర్మించారు. ఆ స్థలంలో పెద్ద కంటైనర్‌ను క్యాంటీన్ పేరుతో పెట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను చీమకుర్తి మున్సిపల్ పాలకవర్గం వ్యతిరేకించింది. మున్సిపల్ చైర్‌పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మి చంద్ర, కౌన్సిలర్లు చల్లా అంకులు, సోమా శేషాద్రి, బీమన వెంకట్రావు, తప్పెట బాబూరావు, బడే అయ్యపరెడ్డి, ఆముదాలపల్లి ప్రమీల రామబ్రహ్మం, గంగిరెడ్డి ఇందిరా సుందరరామిరెడ్డి, పొదిలి వెంకాయమ్మ కాశి, కె.ప్రతాప్‌రెడ్డి, పత్తి కోటేశ్వరరావు, ఎస్‌కే ఖాజాతో పాటు వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, బూత్ కన్వీనర్ మంచా హరికృష్ణలు కమిషనర్ వై రామకృష్ణయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. మురుగు కాలువల ఆక్రమణలను తొలగించాలని, మెప్మా క్యాంటీన్‌ను వేరే ప్రదేశానికి తరలించాలని, విలువైన ప్రభుత్వ స్థలాన్ని, ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి మహిళా సమాఖ్య లీడర్ ఈర్ల తులసి, భవానీ మహిళా సమాఖ్య లీడర్ మారం సాయమ్మ పేర్లుతో రూ.14 లక్షలను మంజూరు చేయడంతో తృప్తి క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలివిడతగా మంజూరైన క్యాంటీన్‌ను చీమకుర్తి నెహ్రూనగర్‌లోని మెయిన్‌రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినిచ్చామని చెప్పారు. అయితే ఈ ఖాళీ స్థలం, గోడౌన్‌లో గతంలో సెరికల్చర్ డిపార్టుమెంట్ కార్యాలయం నిర్వహించారు. అనంతరం బీసీ హాస్టల్ విద్యార్థుల వసతి కోసం వినియోగించారు. బీసీ హాస్టల్‌ను వేరే ప్రదేశానికి తరలించడంతో ఖాళీగా ఉన్న స్థలం, గోడౌన్‌ను తమకు కేటాయించాలని రిటైర్డ్ ఉద్యోగులు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దళిత సంఘాలు..సామాజిక భవనానికి కేటాయించాలని కోరుతున్నారు. ఈ స్థలానికి ఎదురుగా మెయిన్‌రోడ్డుపై పలువురు మహిళలు టిఫిన్ కొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తూ మున్సిపాలిటీకి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. వారిని కాదని అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో మెప్మా క్యాంటీన్‌ను అడ్డం పెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ పాలవకర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. తక్షణమే మెప్మా క్యాంటీన్‌ను వేరే ప్రదేశానికి తరలించాలని, ప్రభుత్వానికి చెందిన ఆస్తులను రక్షించాలని కోరుతున్నారు.
క్యాంటీన్ పేరుతో ఖాళీ స్థలంపై కన్ను


