మూగబోయి..! | - | Sakshi
Sakshi News home page

మూగబోయి..!

Nov 20 2025 7:00 AM | Updated on Nov 20 2025 7:00 AM

మూగబోయి..!

మూగబోయి..!

పశువైద్యశాలలో మందుల కొరత ఆర్‌ఎస్‌కేల్లోనూ అదే పరిస్థితి పశువులకు రోగం వస్తే మందులు బయటకొనాల్సిందే మందులు తెచ్చుకుంటే వైద్యం చేస్తామంటున్న వైద్యులు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారమైన పశుపోషణ వైఎస్సార్‌ సీపీ హయాంలో ఇంటిముంగిటకే వైద్యసేవలు

సేవలు

గడ్డి కోసం పొలాల వెంట తిరుగుతున్న గేదెలు

మార్కాపురం:

జిల్లాలో మొత్తం 84 పశువైద్యశాలలు, 55 గ్రామీణ పశువైద్యశాలలు ఉన్నాయి. ఇందులో త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, గిద్దలూరు, హనుమంతునిపాడు, కనిగిరి, సీఎస్‌పురం, పొదిలి, కొండపి, టంగుటూరు, త్రోవగుంట, నాగులుప్పలపాడు, చీమకుర్తి, దర్శి, కురిచేడు, మద్దిపాడులలో అసిస్టెంటు డైరెక్టర్‌ స్థాయి కలిగిన ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయంతోపాటు పాడిపశువులే రైతుల జీవనాధారం. వర్షాకాలంలో తరచుగా అవి వివిధ రకాల వ్యాధులకు గురవుతాయి. చూడిగేదెలు, గేదెలు, దూడల సంరక్షణ, పశుపోషకులకు భారంగా మారుతోంది. వివిధ ప్రాంతాల్లో రకరకాల నీరు తాగి చర్మరోగాలతో పాటు కడుపు ఉబ్బరం, జ్వరం, నొప్పులతో బాధపడుతుంటాయి. వాటిని కాపాడుకునేందుకు పశుపోషకులు వైద్యశాలకు వెళితే మందులు లేవనే సమాధానం వస్తోంది. అరకొర మందులతో నెట్టుకొస్తున్నారు.

మందుల కొరతతో అవస్థలు

నాలుగైదు నెలల నుంచి జిల్లాలోని పలు వైద్యశాలల్లో మందుల కొరత ఏర్పడింది. దీంతో డాక్టర్లు తమ వద్ద లేని మందులను బయట తెచ్చుకోవాలని చీటీపై రాసిస్తున్నారు. మందులు తెచ్చుకుంటే వైద్యం చేస్తామని డాక్టర్లు చెబుతుండడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఆర్‌ఎస్‌కేలలో సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జ్వరానికి సంబంధించి పారాసిటమాల్‌, మెలనెక్స్‌, హార్టిజోన్‌, అరుగుదలకు సంబంధించి బీ కాంప్లెక్స్‌, నొప్పులకు సంబంధించి పెయిన్‌కిల్లర్స్‌, పొట్ట ఉబ్బరం వస్తే ఉపయోగించే టిమ్‌ఫోనిన్‌, యాంటిబయాటిక్స్‌, బ్లోబెండ్‌, వాతం వస్తే ఉపయోగించే పొడి మందు జెన్సీన్‌, చిర్రెట్‌, జింజర్‌, పొదుగువాపు వ్యాధి వస్తే ఉపయోగించే మూడు రకాల మందులతోపాటు యాంటిబయాటిక్స్‌ జీవాలకు దగ్గు వస్తే వాడే టైల్‌సిన్‌, చర్మవ్యాధులొస్తే ఉపయోగించే సల్ఫర్‌ బేస్డ్‌ పౌడర్‌ ఇలా అన్ని ప్రధాన మందులకు కొరత ఏర్పడింది. వీటితోపాటు లైఫ్‌ సేవింగ్‌ మందులైన డెక్సామెథాజోన్‌, బీటా మెథాజోన్‌, ఐసోఫ్లెడ్‌ తదితర మందులు లభించడంలేదు. డాక్టర్లు చీటీరాసి ఇస్తే ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసి జీవాలను కాపాడుకుంటున్నారు. దీంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పశుపోషణపై నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మందుల కొరత లేకుండా చూశారు. వైద్యశాలలకు రైతుసేవా కేంద్రాలకు మందులను సరఫరా చేశారు. మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో 16 సంచార అంబులెన్స్‌ను కేటాయించి 1962 ఫోన్‌ నంబరుకు ఫోన్‌ చేస్తే ఇంటి ముంగిటే వైద్యం అందేది.

మందులు అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం పశువైద్యశాలలకు వెంటనే మందులు సరఫరా చేయాలి. మందుల కొరత మూలంగా జీవాలకు అనారోగ్యమై వైద్యశాలకు తీసుకెళ్తే మందులు లేవంటున్నారు. దీంతో బయట కొని వాటికి వైద్యం చేయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెటర్నరీ మందులను త్వరగా వైద్యశాలలకు అందించాలి.

– జి.బాలనాగయ్య, గొర్రెలు, మేకల పెంపకందారుల జిల్లా నాయకులు, మార్కాపురం

పశువులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం

జిల్లాలో పశువులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను ఉన్నంత వరకూ ఆయా వైద్యశాలలకు పంపుతున్నాం. మా సిబ్బంది కూడా అందుబాటులో ఉండి పశువులకు చికిత్స చేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

– వెంకటేశ్వరరావు, జాయింట్‌ డైరెక్టరు, ఒంగోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement