హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన కల్తీ నెయ్యి అంటూ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేటట్లు చేయడం తప్పా..? స్వామి వారి ప్రతిష్టను నలుదిక్కులా పెంచిన ఘనత వైవీ సుబ్బారెడ్డిది ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు
ఒంగోలు సిటీ: సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆడబిడ్డలకు ఇస్తానన్న రూ.1500 ఇవ్వలేక, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు ఇస్తామని చెప్పి 60 ఏళ్లు దాటినవారికే ఇంత వరకు కొత్త పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇవన్నీ చేయలేక, ప్రభుత్వం నడపటం చేతకాక, పేర్లు మార్చుకోవడం, డైవర్ట్ చేయడం వంటి విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఎకరం 99 పైసలకు, మెడికల్ కాలేజీలు ఎకరం రూ.100 లకు అంటూ లీజులకు అని చెప్పి ప్రైవేటుపరం చేస్తుండటంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, ఇది తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా కల్తీ నెయ్యి అంటూ ఒక కొత్త వివాదాన్ని బయటకు తీసుకొస్తున్నారని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రతిష్టను దిగజార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేటట్లు చేయడం తప్పా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో టెండర్లలో కొద్దిమంది మాత్రమే పాల్గొనేటట్లు చేసి అనుయాయులకు వచ్చేటట్లు ఫైనల్ చేయడం అలవాటన్నారు. పారదర్శకంగా టెండర్లను విస్తృతపరచాలనీ ఎక్కువమందికి ఎలిజిబిలిటీ తీసుకొస్తే పోటీలో స్వామివారికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నది అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ఒక్కరి నిర్ణయం కాదని, పాలకవర్గం నిర్ణయమని తెలిపారు. మా ప్రభుత్వంలో నాణ్యమైన నెయ్యి కాదని 18 వాహనాలను వెనక్కు పంపించారని, మీ ప్రభుత్వంలో కూడా 14 వాహనాలు వెనక్కు పంపించారన్నారు. కల్తీ జరిగిందన్నా, నాణ్యత తగ్గిందన్నా, వాటర్ కంటెంట్ ఉన్నా ఏది ఉన్నా టెస్ట్ చేసి వెనక్కు పంపిస్తారన్నారు. క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ ఉంటుందని, అధికార యంత్రాంగం చేయాల్సిన బాధ్యతలన్నీ పాలకవర్గానికి ఎట్లా అంటగడతారన్నారు. వై.వి సుబ్బారెడ్డి రెండు దశాబ్దాల క్రితమే స్వర్ణ తిరుమల పెద్ద గెస్ట్ హౌస్‌ను స్వామివారికి కట్టించారన్నారు. అలాగే అయ్యప్పస్వామికి, శ్రీశైలంలో కూడా కట్టించారన్నారు. వై.వి.సుబ్బారెడ్డికి ఉన్న భక్తిని మీరెట్లా శంకిస్తారని ప్రశ్నించారు. వైవీ.సుబ్బారెడ్డి లాంటి భక్తిపరుడిని మీరెందుకు అప్రతిష్టపాలు చేయాలని అనుకుంటున్నారన్నారు. తిరుపతిలో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఫ్‌లైఓవర్ కట్టించారని, రూ.300 కోట్ల పిల్లలకు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించారని, చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయడానికి ఆస్పత్రి కట్టించారన్నారు. టీటీడీ సౌజన్యంతో టాటా వారితో కలిసి క్యాన్సర్ ఆస్పత్రి పెట్టించారన్నారు. శ్రీ వాణి ట్రస్టు పెడితే మీరందరూ విమర్శించారన్నారు. అసలు మీరెందుకు ట్రస్ట్‌ను రద్దు చేయడం లేదు..ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ ఉండబట్టే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుడులు కట్టగలిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కళ్యాణోత్సవాలు జరిపించారన్నారు. వై.వి.సుబ్బారెడ్డి పాలనలో తిరపతికి స్వర్ణయుగమన్నారు. జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు, రైల్వే అండర్‌పాస్‌లు తీసుకొచ్చిన ఘనత వైవీ.సుబ్బారెడ్డిదన్నారు. ఆయన చిత్తశుద్ధి ఏమిటో జిల్లా వాసులందరికీ తెలుసన్నారు. చంద్రబాబుకు అసలు భక్తి అనేది ఉండదని, రాజకీయాల కోసం దేనినైనా అడ్డంపెట్టుకుంటారని ధ్వజమెత్తారు. సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్‌సీపీ నాయకులు తాత నరసింహా గౌడ్, కూనం అశోక్ గౌతమ్, మధు, దేవా, పిగిలి శ్రీనివాసరావు, తాతా నాంచర్లు, వెంకు, తదితరులు పాల్గొన్నారు.


