పక్షవాత రోగులకు గోల్డెన్ అవర్లోనే వైద్యం అందించాలి
ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్
ఒంగోలు టౌన్: బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులకు గోల్డెన్ అవర్లో చికిత్స చేసి కాపాడగలిగే నైపుణ్యం, వనరులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ సూచించారు. సంబంధిత విభాగాలకు చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి రోగిని సాధారణ పరిస్థితిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పక్షవాతం వ్యాధిపై జరిగిన ఒక రోజు సెమినార్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, అందుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు తొలి గంటలోపే చికిత్స ప్రారంభించాలని, అన్నీ రకాల వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలను చేసుకొని అత్యవసరంగా చికిత్స చేయాలని చెప్పారు. తొలి గంటలో చికిత్స చేసినప్పుడే రోగి సత్వరం కోలుకుంటాడన్నారు. న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.హరి మాట్లాడుతూ దేశంలో స్ట్రోక్ పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. జీవన శైలిలో మార్పులు, చేర్పులు చేసుకోవడం ద్వారా స్ట్రోక్‌ను ముందస్తుగా గుర్తించి తగిన వైద్య సలహాలు, అవసరమైన చికిత్స తీసుకోవాలని చెప్పారు. పక్షవాతంపై అవగాహన పెంపొందించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చన్నారు. మరో న్యూరాలజిస్టు డా.నటరాజ్ పోలి బ్రెయిన్ స్ట్రోక్ గురించి, అత్యవసర చికిత్స గురించి వివరించారు. రక్తపోటు నియంత్రణ, థ్రాంబోలిసిస్, నరాలలో రక్తం చిక్కబడడం వంటి సమస్యలను నివారించుకునే విధానాలను తెలిపారు. రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ స్ట్రోక్‌ను గుర్తించడంలో సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ, ఇతర ఆధునాతన ఇమేజింగ్ విధానాల ద్వారా ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్‌లను స్పష్టంగా గుర్తించవచ్చని తెలిపారు. న్యూరో సర్జరీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శరత్ మాట్లాడుతూ పక్షవాతం చికిత్సలో భాగంగా శస్త్ర చికిత్స అవసరమయ్యే పరిస్థితులను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు ప్రభాకర్, తిరుపతి రెడ్డి, రేడియాలజీ ప్రొఫెసర్ నరసింహాచారి, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ పద్మలత తదితరులు పాల్గొన్నారు.


