విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలి
డీఆర్‌డీఏ పీడీ
ఒంగోలు వన్‌టౌన్: విద్యార్థులు జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను సాధించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ టీ నారాయణ సూచించారు. ఒంగోలు టీటీడీసీలోని స్కిల్ కాలేజి ట్రైనింగ్ సెంటర్, స్పైస్ కాలేజీ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీ మాట్లాడుతూ జిల్లాలో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ, యువకులకు వారి అర్హత, ఆసక్తికి అనుకూలమైన కోర్సులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పై అవగాహన, లైఫ్ స్కిల్స్ గురించి 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. శిక్షణ తీసుకుంటున్న వారికి ప్రభుత్వం ఉచిత వసతి, భోజనం, శిక్షణ మెటీరియల్, శిక్షణ అనంతరం కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్, యూనిఫాం ఇస్తుందని పీడీ తెలిపారు. జిల్లా పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో 60 మంది డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 49 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఎలక్ట్రికల్ అసెంబ్లీ ఆపరేటర్, కంట్రోల్ ప్యానెల్ కోర్సులో 168 మంది శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 155 మందికి, బ్రాడ్ బ్యాండ్ టెక్నీషియన్ కోర్సులో 140 మంది శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 128 మందికి, టెక్నికల్ ఇంజినీర్ కోర్సులో 610 మంది శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 199 మందికి, జూనియర్ సాఫ్ట్‌వేర్ కోర్సులో 60 మంది శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 58 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో జేడీఎం డి.శ్రీనివాసులు, ట్రైనర్స్ కె.శ్రీనివాస రావు, కేవీ.ప్రభాకర రావు, బి.అజయ్ కుమార్, జాబ్స్ కో ఆర్డినేటర్ ఓ.హిమాంబి, వార్డెన్ టి. వి.ప్రసన్న, సీడాప్ సిబ్బంది, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


