నగర జనుల జల ఘోష.. పురపాలకులకు తమాషా | - | Sakshi
Sakshi News home page

నగర జనుల జల ఘోష.. పురపాలకులకు తమాషా

Nov 20 2025 6:52 AM | Updated on Nov 20 2025 6:52 AM

నగర జ

నగర జనుల జల ఘోష.. పురపాలకులకు తమాషా

ఒంగోలు కార్పొరేషన్‌లో పర్సెంటేజీల కోసం అడ్డగోలుగా డ్రెయినేజీ పనులు

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు నగర పాలక సంస్థలో పర్సెంటేజీల కోసం చేపడుతున్న పనులు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికార పార్టీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా కార్పొరేషన్‌ అధికారులు తలాడిస్తుండటంతో ప్రజా సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారు. నగర పాలక సంస్థలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఒక రకంగా ప్లాన్‌ చేస్తే, ఇంజినీరింగ్‌ అధికారులు మరో విధంగా పనులు చేపడుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయా విభాగాలను పర్యవేక్షించాల్సిన కమిషనర్‌, మేయర్‌ సైతం అడ్డగోలు పనులపై నోరు మెదపడం లేదు.

వివరాల్లోకి వెళ్తే.. నగర పరిధిలోని కొప్పోలు రోడ్డులో రైల్వే ఫ్లయ్‌ ఓవర్‌ బ్రిడ్జి దగ్గర నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు రూ.2 కోట్లతో డ్రెయినేజీ నిర్మించాలని పురపాలకులు నిర్ణయించారు. అయితే స్టాండింగ్‌ కమిటీ లేకపోవడంతో రూ.40 లక్షల చొప్పున పనులకు మేయర్‌ ముందస్తు అనుమతి ఇచ్చి కౌన్సిల్‌లో ఆమోదించుకునే విధంగా చక్రం తిప్పారు. కౌన్సిల్‌ పదవీ కాలం రానున్న మార్చిలో ముగియనుండటంతో కనీస ప్రణాళిక లేకుండా హడావుడిగా చేస్తున్న పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. కొప్పోలు రోడ్డులోని రైల్వే ఫ్లయ్‌ ఓవర్‌ తూర్పు వైపున ఎఫ్‌సీఐ ఎదురుగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాలనీ, ఇందిరా కాలనీ, పులి వెంకట రెడ్డి కాలనీల వద్ద రోడ్డుకు ఉత్తరం వైపున డ్రెయినేజీ పనులు చేపట్టారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం మంచినీటి పైపులైన్‌ను పగలగొట్టారు. దీంతో వైఎస్సార్‌ కాలనీ, ఇంరిరా కాలనీ, పులివెంకట రెడ్డి కాలనీ, బైపాస్‌కు తూర్పు వైపునున్న రాజీవ్‌ గృహకల్ప, జర్నలిస్టు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎన్‌టీఆర్‌ కాలనీ, కొప్పోలు రోడ్డుకు దక్షిణం వైపున ఉన్న నివాస ప్రాంతాలు, కొప్పోలు గ్రామం, అంబేడ్కర్‌ నగర్‌తో పాటు పలు కాలనీలకు వారం రోజుల నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజలే అధికంగా నివసిస్తున్నారు. డబ్బున్న వారు వెయ్యి లీటర్ల మినరల్‌ వాటర్‌ను రూ.1000 పెట్టి కొనుగోలు చేస్తుండగా, సామాన్యులు నీరు కొనలేక నానా తిప్పలు పడుతున్నారు. ఒక్కో డ్రమ్ము నీరు రూ.50 ఇచ్చి కొనుగోలు చేయడం కష్టంగా ఉందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాము మెలికల్లా డ్రెయినేజీ

కొప్పోలు రోడ్డులో డ్రెయినేజీ పనులు అడ్డగోలుగా సాగుతున్నాయి. సామాన్యుల ఇళ్ల వద్ద ఒక రకంగా, అధికార పార్టీ నాయకుల ఇళ్ల వద్ద మరో రకంగా పనులు చేస్తుండటమే అందుకు నిదర్శనం. టీడీపీ సానుభూతిపరుల ఇళ్ల జోలికి వెళ్లేందుకు ధైర్యం చేయని అధికారులు, సామాన్యుల ఇళ్లను గుల్లగుల్లగా పగలగొట్టారు. పులివెంకటరెడ్డి కాలనీలో అధికార పార్టీకి చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్‌ బంధువుల ఇళ్లు డ్రెయినేజీ మీదకు వచ్చినా వదిలేశారు. ఆ ఇంటి పక్కనే ఉన్న సామాన్యుల ఇళ్లను మాత్రం కూలదోశారు. అధికార పార్టీ నాయకుల తీరును ప్రశ్నిస్తే ఎక్కడ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తారోనని పేదలు లోలోన మదన పడుతున్నారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు నాలుగు వరసల రోడ్డును సర్వే చేసి 20 అడుగుల మేర ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి మార్కింగ్‌ వేశారు. ఈ రోడ్డులో పది అడుగులు మాత్రమే ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ నిర్మాణం కోసం అంగీకారం కుదిరింది. దానిని కూడా అతిక్రమించి సామాన్యులను అష్టకష్టాలపాలు చేస్తుండటంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

కొప్పోలు రోడ్డులో ఎఫ్‌సీఐ ఎదుట టీడీపీ నాయకుడి భవనాన్ని వదిలేసి డ్రెయినేజీని వంక తిప్పిన దృశ్యం

కొప్పోలు రోడ్డులో మసీదు పక్కన టీడీపీ నాయకుడి ఇంటిని వదిలేసి పక్కన దుకాణాన్ని కూల్చిన అధికారులు

పైప్‌లైన్‌ ధ్వంసం చేయడంతో 8 రోజులుగా వేలాది మంది దాహపు కేకలు

డ్రెయినేజీ పేరుతో సామాన్యుల ఇళ్లు కూలగొడుతున్న వైనం

అధికార పార్టీ సానుభూతిపరుల ఇళ్లను వదిలేసి పాము మెలికల్లా డ్రెయినేజీ నిర్మాణం

అధికారులు, అధికార పార్టీ నాయకుల తీరుపై ప్రజల ఆగ్రహం

నీటి కోసం కొప్పోలు అంబేడ్కర్‌ కాలనీ వాసులు రోడ్డెక్కినా స్పందన శూన్యం

నగర జనుల జల ఘోష.. పురపాలకులకు తమాషా 1
1/2

నగర జనుల జల ఘోష.. పురపాలకులకు తమాషా

నగర జనుల జల ఘోష.. పురపాలకులకు తమాషా 2
2/2

నగర జనుల జల ఘోష.. పురపాలకులకు తమాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement