దొనకొండలో ఆర్‌అండ్‌బీ స్థలం కబ్జా
దొనకొండ: పేదల స్థలాలే కాదు ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు వెనుకాడటం లేదు. దొనకొండలో అంబేడ్కర్ సర్కిల్ పక్కన ఖాళీగా ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలానికి ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నేతలు పక్కాగా స్కెచ్ వేశారు. సర్వే నంబర్ 245లో 1.40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని తమ స్వాధీనం చేసుకునే క్రమంలో భాగంగా మంగళవారం రాత్రి బరితెగించారు. అర్ధరాత్రి వేళ జన సంచారం లేని సమయంలో రాళ్లు పాతించి దిట్టంగా ఫెన్సింగ్ వేశారు. బుధవారం ఉదయాన్నే ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు నివ్వెరపోయారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందంటూ కొందరు వ్యక్తులు తహసీల్దార్ బి.రమాదేవికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె డిప్యూటీ తహసీల్దార్ నాగార్జునరెడ్డితో కలిసి ఆర్‌అండ్‌బీ స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల బడ్డీకొట్లు పెట్టుకున్న వారిని విచారించారు. రెవెన్యూ రికార్డులు పరిశీలించి అది ఆర్‌అండ్‌బీ స్థలమేనని నిర్ధారించుకున్నారు. ఆర్‌అండ్‌బీ డీఈ గోపీకృష్ణకు భూ కబ్జా గురించి సమాచారం తెలియజేశామని, ఆయన తిరుమలలో ఉన్నారని తహసీల్దార్ చెప్పారు. ఆర్ అండ్‌బీ డీఈని వివరణ కోరగా.. తాను అందుబాటులో లేనని, వచ్చిన వెంటనే తహసీల్దార్‌తో మాట్లాడి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
1.40 ఎకరాల భూమికి అర్ధరాత్రి వేళ ఫెన్సింగ్
టీడీపీ నాయకుల పనేనని స్థానికుల చర్చ
స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్


