మనవడికి కౌన్సెలింగ్... బామ్మకు రక్షణ
ఒంగోలు టౌన్: మనవడు కొడుతున్నాడంటూ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన బూదాల మాణిక్యం అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఎస్పీ హర్షవర్థన్ రాజుకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ వెంటనే బాధిత వృద్ధురాలికి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, బామ్మ మీద చేయిచేసుకుంటున్న మనవడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పొదిలి సీఐ ఎం.రాజేష్ రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించారు. నాగంపల్లి గ్రామానికి వెళ్లి బాధిత వృద్ధురాలి మనవడు బూదాల మెస్సీకి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రవర్తన మార్చుకోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాణిక్యం పేరున ఉన్న 4 ఎకరాల భూమిని బతుకు తెరువు కోసం ఆమెకిష్టమైన వారికి కౌలుకు ఇచ్చుకునే అధికారం ఉందని, ఈ విషయంలో వృద్ధురాలి కుమారుడు శాంసన్ కానీ, మనవడు మెస్సీ కానీ జోక్యం చేసుకోకూడదని సీఐ సూచించారు. మాణిక్యమ్మ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తరఫున పక్కా ఇంటిని మంజూరు చేయాలని కొనకనమిట్ల తహశీల్దార్‌తో కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో వృద్ధులు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి వాటిని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలతో పాటుగా ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.


