గ్యాస్ అక్రమ వ్యాపారంపై కేసు నమోదు
కురిచేడు: మండల కేంద్రమైన కురిచేడులో అనుమతి లేకుండా గ్యాస్ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై బుధవారం ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఎస్.రాధాకృష్ణ, పొదిలి ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ కె.డేవిడ్‌రాజు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ టి.ముకుందహరి ఆకస్మికంగా దాడి చేసి 6 నిండు, 2 ఖాళీ సిలిండర్లు సీజ్ చేశారు. తన దుకాణంపైనే దాడి చేసిన అధికారులు, అదే తరహాలో పక్కనే వ్యాపారం చేస్తున్న వారిని పట్టించుకోలేదని వ్యాపారి సూరా ప్రసాదరావు ఆరోపించారు. అక్రమంగా గ్యాస్ వ్యాపారం నిర్వహిస్తున్న ఇళ్లు, దుకాణాలను ఆయన స్వయంగా చూపుతున్నప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా రోజూ ఇదే మార్గంలో రాకపోకలు సాగించే అధికారులు అకస్మాత్తుగా దాడి చేయడంలో మతలబు ఏమిటో స్థానికులకు అంతుబట్టలేదు. మొక్కుబడి తనిఖీలు చేసి 8 సిలిండర్లు స్వాధీనం చేసుకుంటే అక్రమ వ్యాపారం ఆగుతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా సిలిండర్లు పట్టుబడిన వ్యవహారంపై స్థానిక టీడీపీ కార్యకర్త ఒకరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీతో మంతనాలు సాగించడాన్ని చూసి స్థానికులు విస్తుపోయారు.


