కనిపించని పేర్లు.. ఖాతాల్లో కన్నీళ్లు
చంద్రబాబు పాలనలో అన్నదాతకు కష్టకాలం దాపురించింది. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత జిల్లాలో మిర్చి, పొగాకు, పత్తి, వరి,
జొన్న..ఇలా అన్ని రకాల రైతులు మద్దతు ధర
లభించక..కనీస
పెట్టుబడులు రాక ఆర్థికంగా నష్టపోయారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం సాయం అందించకుండా
వంచనకు పాల్పడుతోంది.
అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఊసేలేదు. ఈ ఏడాది
ఆగస్టులో కేవలం రూ.5 వేలు ఇచ్చి దగా చేశారు. అంతేకాదు లబ్ధిదారుల జాబితాలో భారీగా కోతలు పెట్టారు. బుధవారం రెండో విడత సాయం అందిస్తున్నామంటూ ఆర్భాటంగా
ప్రకటనలు చేస్తున్నారు. మొదట విడతలో ఇంకా
45 వేల మందికి సాయం అందలేదు. ఇక రెండో విడత ఇచ్చే రూ.134 కోట్లలో ఎంతమందికి ఎగనామం
పెడతారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
● జిల్లాలో తొలివిడతగా 2,68,168 మందిని లబ్ధిదారులుగా గుర్తింపు
లబ్ధిదారుల జాబితా కుదింపే
లక్ష్యంగా....
ఏడాది పాలన తరువాత చంద్రబాబుకు ఎన్నికల హామీ గుర్తుకు వచ్చింది. ఈ ఏడాదిలో సవాలక్ష ఆంక్షలు పెట్టి అర్హుల జాబితాలో భారీగా కోతలు పెట్టారు. చివరకు 2,68,168 మంది రైతులు అర్హులుగా తేల్చాడు. మొదటి విడతలో చంద్రబాబు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది కేవలం రూ.5 వేలు మాత్రమే. రెండో విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ.134 కోట్లు రైతులకు జమ చేస్తానని చెబుతున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇంకా 45 వేల మంది రైతులకు డబ్బులు జమ కాలేదు. వాళ్లకు కూడా ఈ విడతలో పడతాయని అధికారులు చెబుతున్నారు. పీఎం కిసాన్ కింద 2,31,383 మందికి రూ.46.28 కోట్లు జమచేయనున్నారు. అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022–23 సంవత్సరంలో రైతు భరోసా కింది 2,86,256 మందికి ఏడాదికి రూ.13,500 చొప్పున సాయం అందించి. వైఎస్సార్ సీపీ ఐదేళ్లలో జిల్లాలోని రైతాంగానికి రైతు భరోసా రూపంలో అందించింది అక్షరాలా రూ.1,634.85 కోట్లు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఈ ఏడాది ఆగస్టు రెండో తేదీ దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఎర్రటి ఎండలో రైతులను మంచాల మీద కూర్చోబెట్టి సినిమా సెట్టింగ్ వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి మొదటి విడత పీఎం కిసాన్–అన్నదాఖీభవ పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చినట్టుగా రైతులకు ఏడాదికి రూ.20 వేలు కాకుండా పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు జమచేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తయింది, రబీ సీజన్ కూడా వచ్చింది. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. రెండో దఫా సాయం బుధవారం రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. అదీ కూడా కేవలం రూ.5 వేలు మాత్రమే అందించనున్నారు.
పీఎం కిసాన్‌లో 2,31,383 మందే రైతులు...
పీఎం కిసాన్ పథకంలో జిల్లాలో మొత్తం 2,31,383 మందే రైతులను లబ్ధిదారులుగా తేల్చారు. కానీ అన్నదాత సుఖీభవ పథకం కోసం జిల్లా అధికారులు 2,68,168 మందిని గుర్తించారు. జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులను వెరిఫై చేసి 4,38,251 రైతుల జాబితాను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపించారు. ఆర్‌ఐజీఎస్ పరిధిలో ఆ జాబితాను పరిశీలించి 2,72,824 మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. వీరికి ఈకేవైసీ పూర్తి చేయాలని గ్రామ వ్యవసాయ సహాయకుల ఆదేశించారు. చివరకు అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు 2,68,168గా తేల్చారు. రకరకాల వంకలు పెడుతూ లబ్ధిదారుల జాబితాకు ఏ రకంగా కోతలు పెడదామా అన్నట్లు ప్రభుత్వం చూస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.


