ఎమ్మెల్యే కందుల ప్రజాదర్బార్‌లో మహిళా ఆత్మహత్యాయత్నం
మార్కాపురం: తనను ఒక వ్యక్తి నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరుతూ మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్డులో బ్రహ్మంగారి గుడి సమీపంలో నివాసముండే దేవండ్ల సుజాత మంగళవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బారులో వాస్మాల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. తమ ఇంటి సమీపంలో జె.కోటిరెడ్డి అనే వ్యక్తి పాల కేంద్రం నిర్వహిస్తున్నాడని, తనకు అత్యవసరమని చెప్పడంతో పది తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు ఇచ్చానని ఎమ్మెల్యేకు వివరించింది. నగలు, నగదు తిరిగివ్వాలని కోరితే తప్పించుకు తిరుగుతున్నాడని, తనకు న్యాయం చేయాలని వాపోయింది. ఈ క్రమంలోనే వాస్మాల్ తాగడంతో అక్కడే ఉన్నవారు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా సుజాత ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్సై సైదుబాబు తెలిపారు.
● జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి జీవీ శివారెడ్డి
మార్కాపురం: జిల్లాలోని గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, పాఠకులకు చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి జీవీ శివారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథపాలకులు, రికార్డు అసిస్టెంట్లు, ఇతరత్రా సిబ్బంది ఖాళీలు 88 ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం మార్కాపురం శాఖా గ్రంథాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని, పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 66 శాఖా గ్రంథాలయాల్లో 70,659 మంది సభ్యత్వం పొందారని, 6,06,607 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కాంపిటేటివ్ పరీక్షల పుస్తకాలను నిరుద్యోగ అభ్యర్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఒంగోలుతోపాటు మార్కాపురంలో గ్రేడ్–1 గ్రంథాలయం ఉందని, కంభం, కనిగిరి, పర్చూరు, చీరాల గ్రంథాలయాలు గ్రేడ్–2గా నమోదై ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 25 లైబ్రరీలు సొంత భవనాల్లో, మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు. మార్కాపురం డివిజన్‌లో కొమరోలు, అర్ధవీడు, రాచర్ల, ఆకవీడు, పుల్లలచెరువు గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు లేవని చెప్పారు. జిల్లాలో గ్రామ స్థాయిలో 26 లైబ్రరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమపిల్లలను సెలవు రోజుల్లో గ్రంధాలయాలకు పంపాలని విజ్జప్తి చేశారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కందుల ప్రజాదర్బార్‌లో మహిళా ఆత్మహత్యాయత్నం


