శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
పెద్దదోర్నాల: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శ్రీశైలం రహదారిలోని చెన్నంగుల బండ సమీపంలో మంగళవారం జరిగింది. ప్రమాదంలో కనిగిరి పట్టణానికి చెందిన షేక్ ఖాజావలి(27) దుర్మరణం పాలవగా, మరో యువకుడు స్వామి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై కథనం మేరకు..కనిగిరికి చెందిన స్వామి శివమాల వేయడంతో మాలను తీసేందుకు స్నేహితుడు ఖాజావలితో కలిసి మంగళవారం ఉదయం శ్రీశైలం తరలివెళ్లారు. తిరుగు ప్రయాణంలో శ్రీశైలం నుంచి ద్విచక్రవాహనంపై కనిగిరికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న మార్కాపురం డిపో పల్లెవెలుగు వాహనాన్ని చెన్నంగుల బండ వద్ద ఢీకొట్టడంతో ఖాజావలి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన స్వామిని చికిత్స నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలోని వైద్యశాలకు తరలించారు. మృతుడు ఖాజావలికి ఇటీవలే వివాహమైనట్లు బంధువులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సు ఢీ
యువకుడు మృతి, మరో యువకుడికి
తీవ్రగాయాలు


