
కేంద్ర బృందం తనిఖీలు
● ఈ క్రాప్ నమోదు, తదితర అంశాలపై పలు ప్రాంతాల్లో తనిఖీ
జరుగుమల్లి (సింగరాయకొండ): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం కేంద్ర బృందం తనిఖీలు చేపట్టింది. జరుగుమల్లి మండలంలోని పాలేటిపాడు గ్రామంలో ఈ క్రాప్ నమోదుపై కేంద్ర గణాంక బృందం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రాప్ నమోదు సక్రమంగా జరిగిందా..లేదా..? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర గణాంక అధికారి జేవీ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించి 5 సర్వే నంబర్లు ఎంపిక చేసి వాటిలోని భూముల్లో రైతులు ఏయే పంటలు వేశారు.. ఆ భూముల్లో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ఏయే పంటలను ఈ క్రాప్‌లో నమోదు చేశారనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. పంటలు వేయని భూములు వాస్తవమేనా అని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల నమోదును పరిశీలిస్తామని బృంద సభ్యులు వివరించారు. తనిఖీ బృందం వెంట మండల వ్యవసాయ అధికారి యుగంధర్‌రెడ్డి, సూపరింటెండెంట్ రామకృష్ణ, ఏఎస్‌ఓ సుబ్రహ్మణ్యం, వీఆర్‌ఓ రాకేష్, గ్రామ వ్యవసాయ సహాయకుడు రామస్వామి పాల్గొన్నారు.
మర్లపాడు గ్రామంలో తనిఖీలు...
టంగుటూరు: మండలంలోని మర్లపాడు గ్రామంలో పంటల విస్తీర్ణంపై గురువారం కేంద్ర బృందం తనిఖీలు నిర్వహించింది. గ్రామంలోని రైతుల పొలాల్లో కేంద్ర, రాష్ట్ర గణాంకాల అధికారులు వ్యవసాయ, రెవెన్యూ సిబ్బందితో కలిసి వ్యవసాయ భూములు, భూ కమతాల వినియోగంపై ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బృంద అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ మర్లపాడు గ్రామానికి సంబంధించిన వ్యవసాయ కమతాలలో ఏఏ పంటలను రైతులు పండించారు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా..లేదా..? ఈ క్రాప్‌లో నమోదు చేసిన పంటల వివరాలను సేకరించామని వివరించారు. వీఏఏలు ఈ క్రాప్‌లో నమోదు చేసిన పంటలకు, పంట పొలాల్లో ఉన్న పంటలకు మధ్య అంతరాన్ని నమోదు చేసి వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు సలహాలు, సూచనలు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాసరావు, సీనియర్ గణాంకాధికారి రామకృష్ణ, డిప్యూటీ ఎస్‌ఓ సీపీఓ ప్రసాద్‌రావు, ఏవో స్వర్ణలత, మండల సహాయ గణాంకాధికారి శ్రీవాణి, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు సౌమ్య పాల్గొన్నారు.