
డిమాండ్ ఉన్నా ధర దక్కనివ్వడం లేదు
ఒంగోలు సబర్బన్: మార్కెట్‌లో పొగాకుకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు ధర దక్కనివ్వడం లేదని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదికంటే ఈ సంవత్సరం భూముల కౌలు, కూలీ రేట్లు పెరిగాయని, గిట్టుబాటు ధర లేకపోవడంతో సంక్షోభంలో చిక్కుకున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పొగాకుకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతుల నుంచి కొనుగోలు చేయకుండా వేలానికి తెచ్చిన బేళ్లను నోబిడ్, కంపెనీ రిజెక్ట్ పేరుతో వెనక్కి పంపిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట వద్ద కొనుగోలు కేంద్రంలో పొగాకు వేలం తీరును కలెక్టర్ పరిశీలించారు. టుబాకో బోర్డు ఆర్‌ఎం లక్ష్మణరావుతోపాటు వేలం నిర్వహణ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు, ధర తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. పొగాకు సాగు, దిగుబడి, వేలం కేంద్రంలో ఇబ్బందులపై ప్రశ్నించగా వారు తమ ఇబ్బందులను వివరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. పొగాకు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పొగాకు కొనుగోలు చేయాలని బోర్డు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పొగాకు బోర్డు ఆర్‌ఎం లక్ష్మణరావు, వేలం నిర్వహణాధికారి తులసి, ఒంగోలు రూరల్ తహసీల్దార్ వాసు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎదుట పొగాకు రైతుల ఆవేదన
త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని బోర్డు అధికారులకు సూచన