
సాక్షి, విశాఖ: రుషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీపడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. రుషికొండలో పవన్ డ్రామా చేశారు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రుషికొండలో పవన్ డ్రామా చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతలకు రుషికొండ పర్యాటక ప్రాంతంగా మారింది. చంద్రబాబు హైదరాబాద్‌లో 200 కోట్ల రూపాయలతో పెద్ద భవనం కడతే అది పూరి గుడిసె.. అమరావతిలో ఐదు ఎకరాల్లో చంద్రబాబు రాజభవనం కడితే అది స్కీమ్ ఇల్లు. వైఎస్ జగన్ ఇల్లు కట్టుకుంటే అవి మాత్రం ప్యాలెస్. రుషికొండ భవనాలు ఎవరు వాడుకోవాలనే దాని మీద చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య పోటీ నెలకొంది. అందుకే రుషికొండ భవనాలు దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. రుషికొండ భవనం సీలింగ్ కట్ చేశారు. కట్ చేసిన ప్రాంతంలో పవన్ ఫోటో షూట్ చేశారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికి కారిపోతుంది. చదరపు అంగుళానికి రూ.13వేలు పెట్టి కట్టారు. వాటి దుస్థితి చూడండి. అవి పవన్‌కు కనిపించడం లేదా?. ఏరోజైనా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమరావతి సచివాలయానికి వెళ్లారా?.
ఎన్నికల్లో రుషికొండ భవనాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు. పర్యాటక రిసార్ట్ అంటూ ఎందుకు జీవో విడుదల చేశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్డ్ చేయడానికే రుషికొండలో పవన్ డ్రామాకు తెరలేపారు. రుషికొండలో పవన్, నాదెండ్ల మనోహర్ ఫోటో షూట్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
స్టీల్ ప్లాంట్ కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పవన్ కళ్యాణ్ తెరలేపారు. విశాఖ ఉక్కు నా ఆత్మ అంటూ చంద్రబాబు ప్రసంగించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మాట్లాడారు. విశాఖ ఉక్కు అమ్మేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఈవెంట్ల కోసం విశాఖ, పేమెంట్లు కోసం అమరావతి వాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో చేతగాని వ్యక్తులు ఎవరో పవన్‌ను చూస్తే తెలుస్తుంది. వేలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డున పడ్డారు. వారి గురించి చంద్రబాబు, పవన్ ఒక మాట మాట్లాడలేదు.

స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మా వైఖరి మారలేదు. మొదటి నుంచి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. స్టీల్ ప్లాంట్‌పై మా వైఖరి ఒకటే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కూటమి గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే చెప్పారు. వైఎస్ జగన్ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి తెలిపారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు, పవన్, లోకేష్ వైజాగ్ వస్తున్నారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్‌పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. తప్పుడు హామీలు, అబద్ధాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల అవస్థలు కూటమి నేతలు పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్‌పై గతంలో పవన్ కల్యాణ్ ఎన్ని హామీలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు ఏం అయ్యాయి? అని ప్రశ్నించారు.