
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లకు తెలంగాణ కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రేసు నుంచి అనూహ్యంగా మీర్ అమీర్ అలీఖాన్‌ను తప్పించింది కాంగ్రెస్ హైకమాండ్.
ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోసారి కేబినెట్‌లో ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఈ మధ్యే సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది.
ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17ను నిర్ణయించింది.
ఇక.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ మాజీ ఎంపీ అజారుద్దీన్ ధీమాగా ప్రకటించుకున్నారు. మరోవైపు అధిష్టానం వద్ద మైనారిటీ విభాగం ఒత్తిడి నేపథ్యంలో ఆయనకే సీటు ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవిని కట్టబెట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరై ఉంటారా? అనే సస్పెన్స్ కొనసాగనుంది.