కాంగ్రెస్‌కు రాహులే పెద్ద సమస్య 

The Problem With Rahul Gandhi Prashant Kishor Latest Truth Bomb - Sakshi

పనాజీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తీరును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి తప్పుపట్టారు. రాహుల్‌ గాంధీ వాస్తవాలను గుర్తించలేకపోతున్నారని ఆక్షేపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఆయనే పెద్ద సమస్యగా మారారని చెప్పారు. రాహుల్‌ భావిస్తున్నట్లుగా అధికార బీజేపీకి, నరేంద్ర మోదీ పదవికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చిచెప్పారు.

గోవా రాజధాని పనాజీలో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో ప్రశాంత్‌ కిశోర్‌ మాట్లాడారు. సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ వీడియో దృశ్యాలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రశాంత్‌ కిశోర్‌ కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు వెల్లడించారు. కాంగ్రెస్‌కు, ఆయనకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఈ వ్యాఖ్యలను బట్టి అవగతమవుతోంది. కాంగ్రెస్‌లో ప్రశాంత్‌ కిశోర్‌ చేరికను కొందరు సీనియర్లు వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 40 ఏళ్లపాటు కాంగ్రెస్‌ హవా చెలాయించినట్లుగా... బీజేపీ సైతం రాబోయే కొన్ని దశాబ్దాలపాటు దేశ రాజకీయ యవనికపై కచ్చితంగా కేంద్ర స్థానంలో కొనసాగుతుందని ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయం రాహుల్‌ గాంధీకి మాత్రం అర్థం కావడం లేదని, అదే ఆయనతో సమస్య అని చెప్పారు.  ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 30 శాతానికిపైగా ఓట్లు దక్కించుకునే పార్టీకి అప్పటికప్పుడు వచ్చే ప్రమాదమేదీ ఉండదని వివరించారు.

అందుకే ప్రధాని మోదీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ఆయనకు పదవీ గండం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.   ఒకవేళ ప్రజలు మోదీని పదవి నుంచి దించేసినా, బీజేపీ  రాబోయే కొన్ని దశాబ్దాలపాటు అధికారం కోసం ఎన్నికల్లో పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ‘‘నరేంద్ర మోదీ బలాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆయనను ఓడించడం సాధ్యం కాదు’’అని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తుతం గోవాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం పని చేస్తున్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top