
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వానికి వాగ్దానాలు నెరవేర్చడం చేతకాక, బీసీలను వాడుకుంటుందని మండిపడ్డారు. ఈరోజు (గురువారం, అక్టోబర్ 9వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరవింద్ మాట్లాడుతూ.. ఈ-కార్ రేసులో బీఆర్‌ఎస్ నేతలను ఎందుక అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం కేసు ఏమైందని నిలదీశారు అరవింద్, ‘ హరీష్ పాల వ్యాపారం ఏమైంది ? కవిత రాజీనామా ఎందుకు ఆమోదించలేదు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి వెనకబడిన తరగతులను అడ్దం పెట్టుకొని దొంగ నాటకాలు చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. కల్వకుంట్ల కుటుంబంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా డ్రామాలు చేస్తున్నారు. వారి మధ్య దోస్తానాలో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని విమర్శించారు.