జిల్లాలో తగ్గుతున్న ఎయిడ్స్ బాధితులు విస్తృతంగా అవగాహన కలిగిఉండటమే కారణం నేడు ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం
పెద్దపల్లిరూరల్/కరీంనగర్: ఎయిడ్స్ అంటే భయం. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు శరీరాన్ని వదిలివెళ్లదు. మందులు వాడితే నియంత్రణలో ఉంటుంది గానీ ఆదమరిస్తే తిరగబెట్టి కబళించేస్తుంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటుచేసింది. ఫలితంగా జిల్లాలో కొన్నేళ్లుగా ఎయిడ్స్ తగ్గుముఖం పడుతూ వస్తోంది. గతంలో కన్నా ప్రస్తుతం కేసులు తక్కువగా కనిపిస్తున్నా.. జిల్లాలో అధికారికంగానే ప్రతినెల 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా చాలా మంది వ్యాధిబారిన పడుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం.
నెలనెలా పరీక్షలు
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ విభాగం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో బాధితుల సంఖ్య తగ్గుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1,774 మంది హెచ్‌ఐవీ పాజిటివ్‌తో బాధపడుతున్నారు. ఈ ఏడాది 13,773 మందికి పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటివ్ రేటు 0.74గా కొనసాగుతోంది.
అవగాహన ముఖ్యం
హెచ్‌ఐవీ అని తెలియగానే సీడీ–4 కణాల సంఖ్య తగ్గేంత వరకూ అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యసేవలు పొందితే 75 ఏళ్ల వరకూ ఆరోగ్యంగా జీవనం సాగించొచ్చు. ఎయిడ్స్ రోగులూ మధుమేహం, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా మంచి ఆరోగ్యం పొందొచ్చు. హెచ్‌ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్టీ మందులు వాడి ఆ రోగం లేని పిల్లలకు జన్మనివ్వొచ్చు.
వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలి
హెచ్‌ఐవీ బాధితులు ఉదయం 3 కిలోమీటర్లు నడి చి, 15 నిమిషాల పాటు ధాన్యం చేయాలి. గ్లాస్ పా లు, బ్రెడ్, ఉడికించిన గుడ్డు తీసుకోవాలి. రోజూ రాగి జావా, అంబలి తాగాలి. మధ్యాహ్నం భోజ నంలో తాజా కూరగాయలు, ఆలు దుంపలు, ఆకు కూరలు, పప్పు దినుసులు, నాన్‌వెజ్ తీసుకోవాలి. సాయంత్రం ఆపిల్, దానిమ్మ, అంగూర, అరటి, ఫైనాపిల్, సపోట తినాలి. గోధుమ రవ్వ పాలలో కలిపి ఉడికించి ఆరగించాలి. రాత్రి భోజనంలో తాజా కూరగాయలు, రెండు చపాతీలు, నిద్రించే సమయంలో వేడి చేసి చల్లార్చిన నీరు తాగిలి.
ఎయిడ్స్ బారిన యువత...
హెఐవీ కేసుల్లో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే 70 శాతం వరకు హెఐవీ వ్యాధి బారినపడుతున్నారని అధికారుల అంచనా. మద్యానికి బానిస కావడం, మత్తు పదార్థాలు సేవించడం, సురక్షితం లేని శృంగారంలో పాల్గొనడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడవమని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో హైరిస్క్ ప్రవర్తన కలిగిన వ్యక్తులు, ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్ల తరఫున స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పునకు యత్నిస్తున్నాయి. మంచి మందులు అందుబాటులో ఉండడంతో మరణాల సంఖ్య తగ్గింది.


