కఠోరశ్రమ.. క్రమశిక్షణ
70రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రెయినింగ్ రాటుదేలిన సింగరేణి మహిళా రెస్క్యూ బృందం దేశవ్యాప్తంగా ఏడు మహిళా టీంలు జాతీయస్థాయిలో అవార్డు సాధించడమే ‘సింగరేణి’ లక్ష్యం రేపటినుంచి 7 వరకు నేషనల్ లెవల్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: దాదాపు 70రోజుల పాటు కఠోరంగా శ్రమించారు.. అత్యున్నత ప్రమాణాలతో రెసిడెన్షియల్ పద్ధతిన శిక్షణ పొందారు.. జాతీయస్థాయిలో అవార్డు సాధించడం లక్ష్యంగా బరిలో దిగబోతున్నా రు సింగరేణిలోని మహిళా రెస్క్యూ ప్రతినిధులు. ఈమేరకు ఆదివారం మహారాష్ట్రకు చేరుకున్నారు.
రేపటి నుంచి పోటీలు..
ఈనెల 2 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీప మన్సార్ మైన్స్‌లో జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. మాంగనీస్ ఓవర్‌సీస్(ఎంవోఐఎల్) ఆధ్వర్యంలో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎ ల్) మెయిన్ రెస్క్యూస్టేషన్‌లో పోటీలు నిర్వహిస్తా రు. సింగరేణి సంస్థ నుంచి ఒక మహిళా, రెండు పురుషుల జట్లు పాల్గొంటున్నాయి. మన్సార్‌మైన్‌లో రెస్క్యూ రికవరీ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సింగరేణి నుంచి మహిళా రెస్క్యూ జట్టు జాతీయస్థాయిలో పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సింగరేణిది ప్రత్యేకస్థానం..
అంతర్జాతీయ స్థాయి రెస్క్యూ పోటీల్లో సింగరేణి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలిండియాలోని అ నేక సంస్థలకు సింగరేణి శిక్షణ ఇచ్చింది. తాజా పో టీల్లో పాల్గొనే 8 మంది సభ్యులకు కూడా తర్ఫీదు ఇచ్చింది. రెస్క్యూ, రికవరీ, థియరీ, ఫస్ట్‌ఎయిడ్, స్టాట్యుటరీ తదితర విభాగాల్లో ఆర్జీ–2 ఏరియా లోని సింగరేణి మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన తీరుపై ప్రతినిధులను సుశిక్షితులను చేశారు.


