
ఇటుక బట్టీలకు చెరువుమట్టి
● 9,185 టిప్పర్లలో రవాణా ● రూ.2.47 కోట్ల ఆదాయం ● కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని చెరువుల ద్వారా ఇటుక బట్టీలకు 9,185 టిప్పర్లలో మట్టి తరలించడంతో రూ.2,47,99,500 ఆదాయం సమకూరిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మట్టి తరలింపు ద్వారా సమకూరిన ఈ ఆదాయంలో రూ.2.44కోట్లు వెచ్చించి మంథని, ఓదెల, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలా ల్లో సీసీ రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో బుధవారం ఆయన పలు అంశాలపై సమీక్షించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో పారిశుధ్యం మెరుగుపడాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం, నీటి సరఫరాపై దృష్టి సారిస్తూనే వనమహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. ఈనెలాఖరు వరకు సుల్తానాబాద్‌లో డంప్‌యార్డు సమస్యకు పరిష్కారం చూపాలని, కాంట్రాక్టర్ పని చేయకుంటే పారిశుధ్య పనులను వేరొకరికి అప్పగించాలని కలెక్టర్ సూచించారు. తర్వాత మంథని మండలంలోని హెచ్‌ఎంలతో సమావేశమైన కలెక్టర్.. మండలంలో 59 పాఠశాలలున్నాయని, రోజూ ఫేషియల్ రికగ్నేషన్ హాజరు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. డీఈవో మాధవి తదితరులు ఉన్నారు.
గుణాత్మక విద్య అందించాలి
ఎలిగేడు(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని కలెక్టర్ కో య శ్రీహర్ష సూచించారు. సుల్తాన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మాజీ సర్పంచ్, దివంగత తానిపర్తి కాంతారావు జ్ఞాపకార్థం ఆయన కుమారులు సత్యనారాయణరావు, రవీందర్‌రావు, దామోదర్‌రావు, మహేందర్‌రావు, రంగారావు, వెంగళరావు రూ.5లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటో, రూ.2.16లక్షల విలువైన డైనింగ్ టెబుళ్లు అందించగా కలెక్టర్ శ్రీహర్ష పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యా బోధనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తహసీల్దార్ యాకయ్య, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంఈవో నరేంద్రచారి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.