
క్వార్టర్లు కాదు.. సొంతింటి పథకం కావాలి
గోదావరిఖని: కార్మికులకు క్వార్టర్లు కాదని, సొంతింటి పథకం అమలు చేయాలని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఆదివారం గోదావరిఖనిలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూడేళ్ల నుంచి సింగరేణి కార్మికులందరికీ నయాపైసా ఖర్చు లేకుండా కంపెనీకి భారం పడకుండా ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా సొంతిల్లు అమలు చేయొచ్చని చెప్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. సొంతిల్లు అమలు చేయకుండా రూ.450 కోట్లతో 1,003 క్వాటర్లు నిర్మిస్తామని, అందుకు 50 ఏళ్ల పైబడిన క్వాటర్లు కూల్చేసి వాటి స్థానంలో డబుల్ బెడ్రూం క్వాటర్లు నిర్మిస్తామని అంటోందన్నారు. వెయ్యి క్వార్టర్ల నిర్మాణానికి రూ.450 కోట్లు ఖర్చు అవుతుందని, ఇలా సంస్థ వ్యాప్తంగా 60 ఏళ్లు నాటిన వాటిని కూల్చివేసి కొత్తవి నిర్మిస్తే ఇంకా ఎన్ని కోట్లు అవుతాయని ప్రశ్నించారు. కంపెనీకి, కార్మికుడికి ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వానికి పేరు వచ్చేలా కార్మికులందరికీ ఇల్లు వచ్చేలా మా దగ్గర ప్లాన్ ఉందన్నారు. సమావేశంలో నాయకులు రాజమౌళి, మెండె శ్రీనివాస్, సాయిరెడ్డి, గౌస్, సురేష్, రవి, వెంకటేశ్వర్లు, శివరాంరెడ్డి, సత్యనారాయణ, శశికిరణ్, రవి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.