
ఉత్కంఠకు తెర
● 60 డివిజన్ల పునర్విభజన తుది జాబితా విడుదల ● ఇంకా వెల్లడించని ఇంటి నంబర్లు, కాలనీల పేర్లు ● హద్దులు మాత్రమే ప్రకటించిన బల్దియా అధికారులు
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఎట్టకేలకు 60 డివిజన్ల పునర్విభజన ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 21న తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. కానీ, వారం తర్వాత 21వ తేదీతోనే జీవో ఎంఎస్ నంబర్ 145 ద్వారా శనివారం రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు విడుదల చేయడం గమనార్హం. నగరంలో ఇటీవల విలీనమైన లింగాపూర్, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లిగేట్, అక్బర్‌నగర్ గ్రామాలను కలిపి 60 డివిజన్లుగా విభజిస్తూ హద్దులతో కూడిన తుది జాబితా విడుదల చేశారు. డివిజన్ల సరిహద్దుల ముసాయిదాకు, తుదిజాబితాకు మధ్య భారీమార్పులు చోటు చేసుకున్నాయి. తుది జాబితాలో ఇంటి నంబర్లు, కాలనీల పేర్లకు చోటివ్వలేదు. ఒక్కో డివిజన్‌కు కేటాయించిన హద్దుల్లో పొందుపర్చిన ఇంటి నంబర్లు, కాలనీల పేర్లను వెల్లడిస్తేనే 60 డివిజన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తుదిజాబితా ప్రకటనపై జాప్యం?
రామగుండం నగరంలో 60 డివిజన్ల విభజనపై సీడీఎంఏ నుంచి తుది జాబితా విడుదలైనా.. మీడియాకు సమాచారం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేశారు. శుక్రవారమే కరీంనగర్ నగర అధికారులు డివిజన్ల విభజనపై జీవో విడుదల చేస్తే.. శనివారం మధ్యాహ్నం వరకు కూడా రామగుండం బల్దియా అధికారులు జీవోను బహిర్గతం చేయలేదు. మీడియా ప్రతినిధులు.. పునర్విభజన జీవో సమాచారం కోసం ప్రశ్నల వర్షం కురిపించడంతో ఎట్టకేలకు సాయంత్రం జీవో విడుదల చేశారు.
అయోమయం.. గందరోళం..
తుదిజాబితాలో డివిజన్ల హద్దులు మాత్రమే ఇవ్వడం గందరగోళం, అయోమయానికి దారితీసింది. ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర, తిరిగి ఉత్తరానికి హద్దులు మాత్రమే ప్రకటించడంతో చాలామంది నగరవాసులు డివిజన్లను అంచనా వేయలేకపోతున్నారు. ఏ ఇంటి నంబర్ నుంచి ఏ ఇంటినంబర్ వరకు, ఏ కాలనీ అనేది ప్రకటిస్తేనే తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తుది జాబితా కూడా తప్పులతడకగా ఉందంటూ సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేస్తున్నారు.
హద్దులు మాత్రమే ప్రకటన..
డివిజన్ల పునర్విభజనకు సంబంధించి శనివారం హద్దులు మాత్రమే విడుదల చేయడంతో పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. ఈనెల 4న జారీ చేసిన ముసాయిదాలో ఇంటి నంబర్లు, కాలనీల పేర్లతో 60 డివిజన్ల వివరాలను ప్రకటించారు. తుదిజాబితాలో డివిజన్ల హద్దులతోనే సరిపెట్టడం గందరగోళానికి దారితీసింది. ముసాయిదా తరహాలోనే ఇంటినంబర్లు, కాలనీల పేర్లతో కూడిన డివిజన్ల వివరాలను వెల్లడిస్తేనే అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందని నగర ప్రజలు అభిప్రాయపడు తున్నారు. రాష్ట్రంలో వార్డుల విభజన చేపట్టిన 30 మున్సిపాలిటీలకు ఇదే తరహాలోనే తుదిజాబితా విడుదల చేసినట్లు తెసింది. కాగా, సోమవారం డివి జన్ల కాలనీలు, ఇంటి నంబర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు వెల్లడించారు.
ఆశావాహుల డివిజన్ల బాట..
మరోవైపు.. డివిజన్ల పునర్విభజన తుది జాబితా విడుదల కావడంతో మాజీ కార్పొరేటర్లు, ఆశావాహులు అప్పుడే కొత్త డివిజన్ల బాటపట్టారు. ముసాయిదా జాబితా తర్వాత తుదిజాబితాను సీడీఎంఏకు బల్దియా అధికారులు పంపించారు. ఈక్రమంలో ఓ జాబితా బల్దియా ఆఫీస్ నుంచి లీక్ అయ్యింది. ఈ జాబితా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఇదే జాబితాను ఫైనల్‌గా భావించిన చాలామంది ఆశావాహులు.. తాము కోరుకున్న డివిజన్లలో వారం రోజులుగా బస్తీపెద్దమనుషులతో టచ్‌లో ఉంటున్నారు. హద్దులతో కూడిన తుదిజాబితా మా త్రమే విడుదల కావడంతో మరికొందరు అర్థంకాక తలలుపట్టుకుంటున్నారు.