
అభివృద్ధి పనులకు నిధులివ్వాలి
● సీఎస్‌కు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ విజ్ఞప్తి ● రాష్ట్ర మంత్రిని కలిసిన మక్కాన్‌సింగ్
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. శనివారం హైదరాబాద్‌లో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా అదనపు నిధులు మంజూరు చేయాలన్నారు. రోడ్ల ఆధునికీకరణకు రూ.120 కోట్లు, డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ.80 కోట్లు, డిగ్రీ కాలేజీ భవనం, ల్యాబ్, కంప్యూటర్ సౌకర్యం, మహిళలు, విద్యార్థుల రక్షణ దృష్ట్యా ప్రత్యేక బాలికల హాస్టల్స్ నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. రామగుండంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.250 కోట్లు అవసరం ఉంటుందన్నారు. ఎంఎస్ ఏఈ పరిశ్రమల ఏర్పాటుకు స్థలాల కేటాయించాలన్నారు. విద్యుత్, నీటి సౌకర్యం కల్పన కోసం ప్రత్యేకంగా రూ.వంద కోట్లు అవసరమన్నారు. హరితహారం, పచ్చదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థనపై చీఫ్ సెక్రటరీ సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. అదేవిధంగా ప్రభు త్వ ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనరసింహను ఎమ్మెల్యే ఠాకూర్ కలిసి విన్నవించారు. జనాభా, నగర విస్తరణ, ఆస్పత్రిపై అధిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 108 వాహనాల సంఖ్య పెంచాలన్నా రు. వైద్యసిబ్బంది ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. పీరియాడ్రిక్, గైనకాలజీ, ట్రామాకేర్ విభాగాలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సిమ్స్ వద్ద రాజీవ్ రహదారిపై పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అన్నారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.