
ప్రశ్నించే వారిపై దాడులా?
● అక్రమ కేసులు నమోదు చేస్తే ఎలా? ● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం ● రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
గోదావరిఖని: ప్రశ్నించే వారిపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయని, దాడిలో గాయపడిన తమ నాయకులపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాకు బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో లా అండ ఆర్డర్ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. దాడికి గురై తీవ్రంగా గాయపడిన వారిపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా నిర్బంధాన్ని పెంచుతున్నారని ధ్వజమెత్తారు. మంచిర్యాల పట్టణంలో మధు అనే తమ పార్టీ కార్యకర్తను తీవ్రంగా కొట్టి గాయపర్చారన్నారు. బాధితుడిపైనే కేసు నమోదు చేసి దాడిచేసిన వారిని విస్మరించారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియాపైనా కేసులు పెడుతున్నారన్నారు. మంచిర్యాలలో 20 మందిపై ఇలా తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కాంగ్రెస్ గూండాలు బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి దాడులను చూస్తే.. శాంతిభద్రతలు అదుపు తప్పాయనే దానికి సంకేతంగా నిలుస్తున్నాయన్నారు. అదే బీఆర్‌ఎస్ హయాం ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలందరికీ పోలీసులు అందుబాటులో ఉండేలా చేశామని గుర్తుచేశారు. ఈవిషయంలో సీపీకి అన్ని విషయాలు వివరించామని, కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశామని ఈశ్వర్ తెలిపారు.