
గోదావరిఖనిలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
● డాక్టర్ లేని కంటి ఆస్పత్రి నిర్వహణపై ఆగ్రహం ● ఆస్పత్రిని మూసివేయించిన జిల్లా వైద్యాధికారి
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్‌ఓ) అన్న ప్రసన్నకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక మార్కండేయకాలనీలోని ఐ మాక్స్ విజన్ కేర్ కంటి ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో దానిని మూసివేయించారు. అలాగే జనని ఆస్పత్రిలో డాక్టర్ కె.స్రవంతి 24గంటపాటు అందుబాటులో లేరని, ఆ డాక్టర్ పనిచేయడం లేదని సిబ్బంది వెల్లడించారని, ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందికి కూడా తగిన విద్యార్హతలు లేవని గుర్తించారు. సెల్లార్‌లో ల్యాబ్, ఇన్ పేషంట్లతో వార్డు నడుపుతుండడం, ఆపరేషన్ థియేటర్, కారిడార్, ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిష్టర్డ్ కన్సల్టెంట్ డాక్టర్లు కాకుండా, వేరే డాక్టర్లను నమోదు చేసుకున్నా.. బేసిక్ కాకుండా స్పెషాలిటీ ఆస్పత్రి నడుపుతున్నారని డీఎంహెచ్‌వో వెల్లడించారు. ఇలా నిర్వహించడం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి నోటీసు పంపుతామని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. అపెండ్‌సెక్టమి చేయించుకున్న ఓ పేషెంట్‌ను డిశ్చార్జ్ అయ్యే వరకూ ఆస్పత్రి తెరిచి ఉంచడానికి అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. ఆస్పత్రి మేనేజ్మెంట్ మార్పులతోపాటు ఇతర ఎలాంటి మార్పులు చేసినా తప్పనిసరిగా డిస్ట్రిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ అనుమతి తీసుకోవాలని, లేకుంటే నిబంధనల ఉల్లంఘన అవుతుందని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు.