
బల్దియాలో అక్రమ కట్టడాల కూల్చివేత
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పలు అక్రమ కట్టడాలను జేసీబీ వాహనంతో కూల్చివేశారు. గాంధీచౌక్ చౌరస్తాలో ఇటీవల అనుమతి లేకుండా సుమారు 10 దుకాణాలను నిర్మించారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని కూల్చివేశామని టౌన్‌ప్లానింగ్ టీపీఎస్ నవీన్ తెలిపారు. ఇటీవల శివాజీనగర్ రోడ్డు పక్కనున్న సింగరేణి క్వార్టర్లను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో, రోడ్డుకు అడ్డుగా ఉన్న దుకాణాలనూ తొలగించారు. ఈ దుకాణాల నిర్వాహకులే ఉపాధి కోసం చౌరస్తాలో తాత్కాలికంగా దుకాణాలు నిర్మించుకున్నట్లు వ్యాపారస్తులు వెల్లడిస్తుండగా, వీటికి ఎలాంటి అనుమతుల్లేవని బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉంటే, స్థానిక కల్యాణ్‌నగర్ చౌరస్తాలోని బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ నాయకుని ఇంటిని ఇటీవల రోడ్డు విస్తరణ కోసం కూల్చివేత చేపట్టగా, భవన యజమాని విజ్ఞప్తి మేరకు కూల్చివేతను నిలిపివేశారు. సోమవారం మరోసారి మిగిలిన భాగాన్ని టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేశారు.