
అన్నదాతా.. రైతు వేదికకు రావా?
● కర్షకులను బతిమాలుకుంటున్న ఏఈవోలు ● సీఎం కార్యక్రమం కోసం ఏఈవోలకు టార్గెట్లు ● ప్రతీ ఆర్వీకి 200 మంది రైతులను తరలించాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 50 వేలకుపైగా రైతుల తరలింపు ● టీ, స్నాక్స్ డబ్బులు మాత్రం ఇవ్వరట ● మొన్నటి కార్యక్రమానికి పెట్టిన డబ్బులే రాలేదు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
రైతు వేదికల్లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంతో ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్)లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమానికి రైతు వేదిక(ఆర్వీ)ల వద్దకు రైతులను తరలించాలని జిల్లా వ్యవసాయాధికారులు టార్గెట్లు విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతీ ఆర్వీలో కనీసం 200 మందికి తగ్గకుండా రైతులను తరలించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో ఏఈవోలు అదేపనిలో తలమునకలయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి వచ్చేందు కు మెజారిటీ రైతులు సుముఖంగా లేరు. ప్రస్తుతం చాలాచోట్ల వ్యవసాయ పనులు మొదలవుతున్నా యి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎంతో జరిగే ముఖాముఖిలో తప్పకుండా రైతుభరోసా లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది రైతులకు ఏఈ వోలు ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమాలుతున్నారు. మొన్నామధ్య రైతుభరోసా ప్రారంభం సందర్భంగా కూడా రైతులతో ముఖ్యమంత్రితో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. అప్పుడు ప్రతీ ఏఈవోకు నిర్వహణ ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆ కార్యక్రమంలో హాజరైన ప్రతీ రైతుకు టీ, స్నాక్స్‌ను ఏఈవోలే అందించారు. ఇందుకోసం వారే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటే.. తీరా మరోసారి అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేది లేక మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తూ.. చేతి చమురు వదిలించేందుకు సిద్ధమవుతున్నారు.
రైతు వేదికల్లో ఇబ్బందులివీ!
చాలాచోట్ల తాగునీరు సదుపాయం లేదు
కుర్చీలు వేసే సిబ్బంది లేరు
టీ, స్నాక్స్ ఇచ్చే దిక్కు లేదు
మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు
రైతు వేదికకు కనీసం ఊడ్చే సిబ్బంది లేరు
టెక్నికల్ ఎక్విప్‌మెంట్‌కు డబ్బులు రావు,
నిర్వహణకు సిబ్బంది లేరు..
జిల్లా రైతు వేదికలు ఏఈవోలు
కరీంనగర్ 75 71
జగిత్యాల 52 71
పెద్దపల్లి 54 52
సిరిసిల్ల 57 53