
రక్షణపై పట్టింపు లేదు!
● వరుస ప్రమాదాలతో ఓసీపీ–3 కార్మికుల ఆందోళన ● హాలేజీ రోడ్ల వెంట రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా క్వారీలో హాలేజీ రోడ్లు సరిగా లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు పేర్కొంటున్నారు. ఈనెలలో మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ప్రణాళికలేమితోనే..
సింగరేణిలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు–3(ఓసీపీ)లో అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతోనే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత విషయం బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఈనెల మొదటి వారంలో జనతా గ్యారేజీ సమీప మూలమలుపు వద్ద రెండు డంపర్లు ఢీకొన్నాయి. సరైన విజన్ లేక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే ఇదే గ్యారేజీ సమీపంలో మెటీరియల్ తరలిస్తున్న క్రేన్ పల్టీపడింది. రోడ్డు సరిగా లేక మెటీరియల్ లోడ్‌తో వస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి పడిపోయిందని అంటున్నారు. ఆపరేటర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో గాయాలు కాకుండా తప్పించుకున్నాడు. అలాగే ఈనెల 17న సాంకేతిక కారణాలతో క్వారీలో డీజిల్ బోజర్(ట్యాంకర్) నిలిచిపోయింది. వాహనానికి టోషన్ తగిలించి తీసుకొస్తుండగా కట్టిన టోషన్ ఊడిపోయి పల్టీపడింది. డీజిల్ బోజర్‌లో ముగ్గురు కార్మికులు ఉండగా అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా లోతులోని క్వారీలో పడేదని అంటున్నారు.
సీహెచ్‌పీలో ఇద్దరికి గాయాలు
ఓసీపీ–3 సీహెచ్‌పీలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఫైర్‌కోల్ కన్వేర్‌బెల్ట్‌పై రవాణా చేస్తున్న క్రమంలో ఒక కన్వేయర్ ఆపరేటర్ మెడపై, మరో కన్వేయర్ తొడపై వేడి బొగ్గులు పడడంతో గా యాలైనట్లు చెబుతున్నారు. ఈవిషయాన్ని బయటకు పొక్కకుండా బాధితులకు చికిత్స చేయించినట్లు చెబుతున్నారు.
రక్షణపై దృష్టి సారించక..
ఉత్పత్తి, రక్షణ రెండు కళ్లలాంటివని చెబుతున్న సింగరేణి యాజమాన్యం.. బొగ్గు ఉత్పత్తిపై కార్మికులు, ఉద్యోగులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. రక్షణ విషయంలో సరిగా వ్యవహరించడం లేదని వాపోతున్నారు. ఇప్పటిౖకైనా యాజమాన్యం స్పందించి తప్పిదాలపై పునఃసమీక్షించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.