
‘బోనస్’ కోసం రైతుల నిరీక్షణ
● అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమకాని సొమ్ము ● వానాకాలం పంట పెట్టుబడికి అన్నదాత తిప్పలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): సన్నవడ్ల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ సొమ్ము అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ఇంకా జమకాలేదు. వసతి గృహాలు, రేషన్‌షాపులు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. ఇందుకు అవసరమైన సన్నవడ్లు అధిక విస్తీర్ణంలో పండించేలా రైతులకు ప్రోత్సాహకంగా బోనస్ అందిస్తోంది. ఒక్కో క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. అందు లో భాగంగానే గతేడాది వానకాలంలో బోనస్ సకాలంలో, సజావుగా పంపిణీ చేశారు. ఈఏడాది యా సంగి ధాన్యం కొనుగోళ్లు ముగిసి 20 రోజులు కావొస్తున్నా.. బోనస్ నిధులు ఇంకా విడుదల కాలేదు.
వానాకాలం పంట పెట్టుబడికి..
మొన్నటి యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 3,98,006 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించిన రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేశారు. కానీ, బోనస్ ఎప్పుడు చెల్లిస్తారోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దుక్కిదున్నడం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లకు బోనస్ డబ్బులు అక్కరకు వస్తాయని రైతులు ఎంతోఆశతో ఉన్నారు. కానీ, సుమారు ఇరవై రోజులు గడుస్తున్నా బోనస్ పైసలు పడకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.