
108 మందికి ప్రయోజనం
● ఉద్యోగ విరమణ వయసు పెంపు ● అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల హర్షం
సుల్తానాబాద్(పెద్దపల్లి): అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో సుమారు 108 మందికి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసును 61ఏళ్ల నుంచి 65ఏళ్ల వరకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఇదేసమయంలో టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీ కోసం కసరత్తు చేస్తోంది.
సిబ్బందికి ప్రోత్సాహకాలు..
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. విధుల్లో ప్రతిభ చూపిన టీచర్లకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రోత్సాహాలను సైతం పెంచింది. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథనిలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి.
17 టీచర్.. 96 ఆయా పోస్టుల భర్తీ..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 17 టీచర్, 96 సహాయకుల పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ పాసై 18 – 35 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులని అధికారులు తెలిపారు. గతంలో మార్కుల ఆధారంగా పోస్టులు భర్తీ చేసిన అధికారులు.. ఈసారి మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారా, లేక రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారా? అనేదాంట్లో స్పష్టత ఇవ్వడంలేదు.