
చిగురిస్తున్న ఆశలు
● భూ సమస్యల పరిష్కారానికి మార్గం ● జిల్లాలో ముగిసిన భూభారతి సదస్సులు ● సమస్యలపై 15,916మంది దరఖాస్తు ● మిస్సింగ్ సర్వే నంబర్లు, అసైన్డ్‌ల్యాండ్ కేసులే అధికం ● ఆగస్టు 15లోగా పరిష్కరిస్తాం : కలెక్టర్ కోయ శ్రీహర్ష
జిల్లాలో భూభారతి అర్జీల వివరాలు
సాక్షి పెద్దపల్లి: అనేకఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని భూసమస్యలపై జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులకు రైతుల నుంచి దరఖాస్తులు వెలువెత్తాయి. తొలుత పైలెట్ మండలంగా ఎలిగేడును ఎంపిక చేసిన జిల్లా ఉన్నతాధికారులు.. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా అమలు చేశారు. ఈక్రమంలో జూన్ 3 నుంచి శుక్రవారం వరకు 200 రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెవాసుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
అర్జీల ఆన్‌లైన్‌కు ఇద్దరేసి ఆపరేటర్లు..
ప్రతీ మండలంలో ఇద్దరేసి ఆపరేటర్లను నియమించిన ప్రభుత్వం.. రైతులు ఫిర్యాదుకు జతచేసిన ధ్రువీకరణపత్రాలు, జతపరిచిన ఆధార పత్రాలను స్కాన్ చేసి, తహసీల్దార్ లాగిన్‌లో ఆన్‌లైన్ చేశారు. ఇలా ఏరోజుకారోజు కలెక్టర్‌కు ఆ జాబితా నివేదించారు. కలెక్టర్ స్థాయిలో సమస్యల వారీగా మరో నివేదిక రూపొందించి సీసీఎల్‌కు పంపించారు. సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఫిర్యాదు సమర్పించిన రైతుతోపాటు సమీపంలోని రైతులకు అఽధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇద్దరి వద్దనున్న రికార్డులతోపాటు ఆధారాలను సమర్పించేందుకు ఏడు రోజుల గడువు ఇస్తారు. నిర్దేశిత గడువులోగా సమర్పించిన ఆధారాలు, రికార్డులను అధికారులు పరిశీలిస్తారు. రెవెన్యూ కార్యాయంలోని రికార్డులతో వాటిని పోల్చిచూస్తారు. అనంతరం ఆ దరఖాస్తు వాస్తవికతను తేల్చి సమస్యకు పరిష్కారం చూపుతారని చెబుతున్నారు. తద్వారా భూభారతితోనైనా తమ భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
పెద్దపల్లిలో 2,508.. రామగుండంలో 124
జిల్లావ్యాప్తంగా అత్యధికంగా పెద్దపల్లి మండలంలో 2,508 దరఖాస్తులు అందాయి. అత్యల్పంగా రామగుండంలో 124 దరఖాస్తులు అధికారులకు అందాయి. వచ్చిన దరఖాస్తుల్లో సాదాబైనామాలు పక్కన పెడితే.. అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, అసైన్డ్‌ల్యాండ్ కేసులే ఉండడం గమనార్హం.
మండలాల వారీగా అర్జీలు..
మండలం అర్జీలు
జూలపల్లి 2,061
ఓదెల 1,267
సుల్తానాబాద్ 1,438
ధర్మారం 1,675
అంతర్గాం 940
పాలకుర్తి 617
కాల్వశ్రీరాంపూర్ 1,381
కమాన్‌పూర్ 393
రామగిరి 353
మంథని 1,681
ముత్తారం 1,478
రామగుండం 124
రెవెన్యూ గ్రామాలు 200
అందిన దరఖాస్తులు 15,916
మిస్సింగ్ సర్వే నంబర్లు 2,715
పెండింగ్ మ్యూటేషన్, కోర్టు కేసులు 630
డిజిటల్ సైన్ పెండింగ్ 745
విస్తీర్ణంలో వ్యత్యాసం 1,048
భూ స్వరూపం మార్పు 213
పాసుపుస్తకంలో పొరపాట్లు 218
నిషేధిత జాబితా 91
అసైన్డ్‌ల్యాండ్ 2,154
ఓఆర్‌సీ జారీ 20
సక్సేషన్ 1,367
భూసేకరణ 83
ఇతర 6,632
45 రోజుల్లో పరిష్కారం
వచ్చే 45 రోజుల్లో భూభారతి దరఖాస్తులు పరిష్కరించేలా కార్యాచరణ అమలు చేస్తాం. ప్రతీదరఖాస్తు పరిష్కారానికి మండలంలో తహసీల్దార్ బాధ్యత వహించేలా, ప్రతీదరఖాస్తుదారుకు నోటీస్ ఇచ్చి పరిష్కరిస్తాం. ప్రతీ మండలంలో పెండింగ్ భూ భారతి దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఈనెల 23 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు రోజుకు ఎన్నిపరిష్కారం కావాలి? ఎన్ని బృందాలను ఏర్పాటు చేయాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తాం. అందుకు అనుగుణంగా సిబ్బందికి బాధ్యతలు కేటాయించి పరిష్కరిస్తాం. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులకు పరిష్కారం చూపలేనిపక్షంలో దానికిగల కారణాలను తెలియజేస్తూ స్పష్టంగా జవాబు తెలియజేస్తాం. దరఖాస్తుదారును కార్యాలయాల చుట్టూ తిప్పుకునే ధోరణి ఉండదు.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్