
తేలని లాభాలా వాటా!
● గతేడాది చరిత్రలో అత్యధిక లాభాలు ● 2023–24లో కార్మికుల వాటా 33శాతం ● ఉద్యోగులకు రూ.788.20 కోట్ల చెల్లింపు ● గతేడాది కాంట్రాక్టు కార్మికులకూ రూ.5వేల వాటా
గోదావరిఖని: గత ఆర్థిక సంవత్సరం పూర్తయింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. గతేడాది సింగరేణి నిర్దేశిత 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. బొగ్గు ఉత్పత్తిపై స్పష్టమైన ప్రకటన చేసిన సింగరేణి యాజమాన్యం.. లాభాలపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడంలేదు. ఆధునిక సాంకేతికను విరివిగా వినియోగిస్తున్న సింగరేణి.. సాధ్యమైనంత త్వరగా లాభాల వాటా ప్రకటిస్తుందని కార్మికులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా సీఎండీ ఎండీ బలరాం ఫైనాన్స్ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో లాభాల విషయాన్ని త్వరగానే తేల్చేస్తారని భావిస్తున్నారు.
వ్యాపార విస్తరణలో వేగంగా..
బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాల్లో వేగంగా దూసుకెళ్తున్న సింగరేణి సంస్థ.. దేశంలో ఏ సంస్థలో లేనివిధంగా కార్మికులను వాటాదారులుగా చేర్చి తను సాధించిన లాభాల్లో ఏటా వా టా చెల్లిస్తూ వస్తోంది. దేశానికే సింగరేణి తలమానికంగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థ ఏటా బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తిపై ఆర్థిక నివేదికలు సమర్పిస్తూ వస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 70 మిలియన్ ట న్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 70.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 2,388.50 కోట్ల లాభాలు సాధించింది. అందులో కార్మికుల వాటాగా 33 శాతం ప్రకటించారు. ఈలెక్కన గత ఆర్థిక సంవత్సరంలో రూ.788.20 కోట్లు కార్మికులకు వా టాగా ప్రకటించారు. గతేడాదికన్నా ఈసారి బొగ్గు ఉత్పత్తితోపాటు టర్నోవర్ పెరగడంతో సంస్థకు లాభాలు కూడా అధికంగానే ఉంటా యని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈక్రమంలో కార్మికులకు లాభాల ఎక్కువగా వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.
లాభాల వాటా ఎంత..?
ఏటా సింగరేణి యాజమాన్యం లాభాలను ప్రకటించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. అందులో కార్మికులకు లాభాల వాటా ముఖ్యమంత్రి ఖరారు చేసి ప్రకటన ఇస్తారు. ఈక్రమంలో ఈసారి లాభాలు ఖరారు అయితే లాభాల వాటా సీఎం ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది 33శాతం కార్మికుల లాభాల వాటా ఉండగా, ఈసారి వాటా మరింత పెంచే అవకాశాలుంటాయని కార్మికులు భావిస్తున్నారు.
వేగంగా ఇంటర్నల్ అడిట్..
సింగరేణి సీఎండీ బలరాం స్వతహాగా ఫైనాన్స్ డైరెక్టర్ కావడంతో లాభాలు తేల్చడంపై ప్రత్యే కంగా దృష్టి సారించారు. ఈక్రమంలోనే సాధ్యమైనంత త్వరగా లాభాలను తేల్చే పనిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ఇంటర్నల్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. స్టాట్యుటరీ అడిట్ ద్వారా విచారణ కొనసాగుతోంది.
గత తొమ్మిదేళ్లలో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలు(రూ.కోట్లలో)
ఏడాది లాభాలు కార్మికుల వాటా చెల్లింపు చెల్లింపు తేదీ
2015–16 1,066.13 23 245.20 07–10–2016
2016–17 395.38 25 98.84 29–09–2017
2017–18 1,212.75 27 327.27 29–08–2018
2018–19 1,766.00 28 493.00 04–10–2019
2019–20 993.00 28 278.04 14–10–2020
2020–21 272.20 29 79.06 11–10–2021
2021–22 1,227.00 30 368.00 10–10–2022
2022–23 2,222.00 32 711.00 22–10–2023
2023–24 2,388.50 33 788.20 20–09–2024
వేగంగా ఆడిట్
సింగరేణి సాధించిన లాభాలపై ఆడిట్ వేగంగా సాగుతోంది. త్వరలోనే ముఖ్యమంత్రికి వార్షిక నివేదిక సమర్పిస్తాం. సీఎం ఆదేశాల ప్రకారం లాభాల వాటా ఉద్యోగులకు అందజేస్తాం. సాధ్యమైనంత త్వరగా లాభాలను తేల్చేందుకు ఆర్థిక శాఖ వేగంగా ముందుకు సాగుతోంది. గతం కన్నా ఈసారి లాభాలు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది.
– ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి

తేలని లాభాలా వాటా!

తేలని లాభాలా వాటా!