
డివిజన్ల పునర్విభజనపై ఉత్కంఠ
● ఇంకా విడుదలకాని తుది నోటిఫికేషన్ ● అందుబాటులో లేని బల్దియా అధికారులు ● మీడియాకు సైతం సమాచారం వెల్లడించని వైనం
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన ఉత్కంఠంగా మారింది. 50 నుంచి 60 డివిజన్లకు పెంచుతూ బల్దియా అధికారులు రూపొందించిన పునర్విభజన ముసాయిదాను ఈనెల 4న విడుదల చేశారు. దీనిపై నగరవాసుల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు.. మార్పులు చేర్పులతోపాటు డివిజన్ల స్వరూపంపై మ్యాప్‌లు, వైశాల్యం, హద్దులు, ఓటర్ల సంఖ్యతో తయారు చేసిన 60 డివిజన్ల తుది నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేయాల్సి ఉంది. కానీ.. రాత్రి 7గంటల వరకు కూడా బల్దియా అధికారులు పునర్విభజనపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇదే విషయంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తోపాటు టౌన్‌ప్లానింగ్ తదితర విభాగాల్లో సమాచారం కోసం ప్రయత్నించగా, అధికారులు కార్యాలయంలో అందుబాటులో లేరు. డివిజన్ల పునర్విభజన తుది నోటిఫికేషన్‌పై డిప్యూటీ కమిషనర్ వెంటకస్వామిని వివరణ కోరగా, తనకు వివరాలు తెలియవన్నారు. కమిషనర్‌తోపాటు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నంచినా.. వారు ఫోన్లను లిఫ్ట్ చేయలేదు. దీంతో డివిజన్ల పునర్విభజన తుది నోటిఫికేషన్ ప్రకటన విడుదలలో జాప్యంపై ఉత్కంఠ నెలకొంది. డివిజన్ల స్వరూపంపై అయోమయం, ఆందోళనతో ఉన్న మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు.. తుది నోఫికేషన్‌పై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో తమకు పరిచయం ఉన్న అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం ఫైనల్ నోటిఫికేషన్ వస్తుందని ఆశపడినవారు, మాజీ కార్పొరేటర్లల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అయితే, డివిజన్ల పునర్విభజన తుది జాబితా ప్రభుత్వ పరిశీలనలో ఉందని, అధికారికంగా అక్కడి నుంచే ఫైనల్ నోటిఫికేషన్‌తోపాటు గెజిట్‌ను విడుదల చేయవచ్చనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.